Ranji Trophy 2022-23: విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైన ఆంధ్ర

3 Feb, 2023 16:26 IST|Sakshi

Hanuma Vihari: ఆంధ్రప్రదేశ్‌ కెప్టెన్‌ హనుమ విహారి ఒంటి చేతి పోరాటం వృధా అయ్యింది. మణకట్టు ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా విహారి ఆడిన ఇన్నింగ్స్‌లు, చేసిన పరుగులకు విలువ లేకుండా పోయింది. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు మధ్యప్రదేశ్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి  నిష్క్రమించింది. విహారి విరోచితంగా ఒంటి చేత్తో, అది కూడా తన సహజ శైలికి భిన్నంగా ఎడమ చేత్తో బ్యాటింగ్‌ చేసి అతి మూల్యమైన పరుగులు సమకూర్చినప్పటికీ ఆంధ్ర టీమ్‌ గెలవలేకపోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేని ఆంధ్ర జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలి విహారి పోరాటానికి అర్ధం లేకుండా చేసింది. ప్రస్తుత సీజన్‌లో విహారి నేతృత్వంలో ఆంధ్ర జట్టు వరుస విజయాలు సాధించి క్వార్టర్‌ ఫైనల్‌ వరకు జైత్రయాత్ర కొనసాగించింది. అయితే క్వార్టర్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్ బౌలింగ్‌లో విహారి గాయపడి మణికట్టు ఫ్రాక్చర్‌ కావడంతో ఆంధ్ర టీమ్‌ ఒక్కసారిగా తేలిపోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (149), కరణ్‌ షిండే (110) సెంచరీలతో కదం తొక్కినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా చేతులెత్తేశారు. గాయపడ్డప్పటికీ బరిలోకి దిగి విహారి చేసిన పరుగులు (27, 15) కూడా సహచరుల్లో స్పూర్తి నింపలేకపోయాయి. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 151 పరుగుల లీడ్‌ కలుపుకుని ఆంధ్ర నిర్ధేశించిన 245 పరుగుల టార్గెట్‌ను మధ్యప్రదేశ్‌ జట్టు 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

యశ్‌ దూబే (58), రజత్‌ పాటిదార్‌ (55) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆంధ్ర బౌలర్లలో లలిత్‌ మోహన్‌, పృథ్వీ రాజ్‌ తలో 2 వికెట్లు, నితీశ్‌ రెడ్డి ఓ వికెట్‌ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ 228 పరుగులకు ఆలౌటైంది.  శుభమ్‌ శర్మ (51) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

స్కోర్‌ వివరాలు..

  • ఆంధ్రప్రదేశ్‌: 379 & 93
  • మధ్యప్రదేశ్‌: 228 & 245/5 (5 వికెట్ల తేడాతో విజయం)

ఈ విజయంతో మధ్యప్రదేశ్‌ సెమీస్‌కు చేరుకోగా.. మరోవైపు జార్ఖండ్‌పై బెంగాల్‌ (9 వికెట్ల తేడాతో), ఉత్తరాఖండ్‌పై కర్ణాటక (ఇన్నింగ్స్‌ 281 పరుగుల తేడాతో) విజయాలు సాధించి ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. సౌరాష్ట్ర-పంజాబ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఫలితం తేలాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు