Ranji Semi Final 2: జాక్సన్‌, అర్పిత్‌ సెంచరీలు.. కర్ణాటకకు ధీటుగా బదులిస్తున్న సౌరాష్ట్ర

10 Feb, 2023 17:49 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక.. మయాంక్‌ అగర్వాల్‌ (249) డబుల్‌ సెంచరీతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ధీటుగా బదులిస్తుంది. షెల్డన్‌ జాక్సన్‌ (160) భారీ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ అర్పిత్‌ వసవద (112 నాటౌట్‌) అజేయ శతకంతో రాణించాడు. వీరిద్దరూ శతకాలతో విరుచుకుపడటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. అర్పిత్‌ వసవదకు జతగా చిరగ్‌ జానీ (19) క్రీజ్‌లో ఉన్నాడు.

ప్రస్తుతానికి సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్‌ దేశాయ్‌ (33), విశ్వరాజ్‌ జడేజా (22) పర్వాలేదనిపించగా.. స్నెల్‌ పటేల్‌ (0) నిరాశపరిచాడు. కర్ణాటక బౌలర్లలో విద్వత్‌ కావేరప్ప 2 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్‌, కృష్ణప్ప గౌతమ్‌  తలో వికెట్‌ దక్కించుకున్నారు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్‌ డబుల్‌ సెంచరీతో రెచ్చిపోగా.. శ్రీనివాస్‌ శరత్‌ (66) అర్ధసెంచరీతో అలరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్‌ సకారియా, కే పటేల్‌ చెరి 3 వికెట్లు పడగొట్టగా.. చిరాగ్‌ జానీ, ప్రేరక్‌ మన్కడ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక, బెంగాల్‌-మధ్యప్రదేశ్‌ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ పూర్తి ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ 327 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైన బెంగాల్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 59 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలిన మధ్యప్రదేశ్‌.. ఈ మ్యాచ్‌లో ఓటమి దిశగా పయనిస్తుంది. 

మరిన్ని వార్తలు