Ranji Trophy 2022: ఒకే గ్రూప్‌లో తలపడనున్న కోహ్లి, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ జట్లు

31 Aug, 2021 10:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌ సంగ్రామం రంజీ ట్రోఫి 2022 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభంకానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కరోనా కారణంగా గతేడాది నిర్వహించలేకపోయిన ఈ టోర్నీలో మొత్తం 38 జట్లు ఆరు గ్రూపులుగా విభజించబడ్డాయి. ఇందులో ఎలైట్‌ గ్రూపులు(ఏ, బి, సి, డి, ఈ- ఒక్కో గ్రూప్‌లో 6 జట్లు) ఐదు కాగా, ప్లేట్‌ డివిజన్‌ గ్రూప్‌ ఒకటి(8 కొత్త జట్లు) ఉంది. మొత్తంగా కొత్త, పాత జట్లతో 2022 రంజీ ట్రోఫి రసవత్తరంగా మారనుంది. ఇక గ్రూప్‌ల్లోని జట్ల వివరాలకు వస్తే..

టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ, ముంబై, కర్ణాటక జట్లు ఒకే గ్రూప్‌లో తలపడనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ జట్లు ఎలైట్‌ గ్రూప్‌-సిలో ఉన్నాయి. ఈ గ్రూప్‌ను గ్రూప్‌ ఆఫ్ డెత్‌గా పరిగణిస్తున్నారు. ఢిల్లీ జట్టుకు కోహ్లి, ధవన్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ వంటి టీమిండియా స్టార్లు ప్రాతినిధ్యం వహించనుండగా.. ముంబై జట్టుకు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్‌ వంటి స్టార్లు ఆడనున్నారు. ఇక కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ వంటి న్యూ జనరేషన్‌ ఆటగాళ్లతో కర్ణాటక జట్టు పటిష్టంగా ఉంది. 

ఇక మిగతా గ్రూప్‌ల విషయానికి వస్తే.. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, సర్వీసెస్, అస్సాం జట్లు ఎలైట్ గ్రూప్-ఏలో..  గతేడాది రన్నరప్ బెంగాల్, విదర్భ, హర్యానా, కేరళ, త్రిపుర, రాజస్థాన్‌ జట్లు గ్రూప్‌-బిలో.. డిఫెండింగ్ ఛాంపియన్ సౌరాష్ట్ర, తమిళనాడు, రైల్వేస్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, గోవా జట్లు గ్రూప్-డిలో.. ఆంధ్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, బరోడా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, పాండిచ్చేరి జట్లు గ్రూప్‌-ఈలో తలపడనున్నాయి. ప్లేట్‌ డివిజన్‌లో చంఢీఘడ్‌, మేఘాలయ, బీహార్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ జట్లు పోటీపడనున్నాయి. ఇక ఈసారి రంజీ గ్రూప్‌ మ్యాచ్‌లు ఆరు నగరాల్లో నిర్వహించనున్నారు. ఎలైట్ గ్రూప్-ఏ మ్యాచ్‌లు(ముంబై), గ్రూప్-బి(బెంగళూరు), గ్రూప్-సి( బెంగళూరు), గ్రూప్-డి(అహ్మదాబాద్), గ్రూప్-ఈ(త్రివేండ్రం), ప్లేట్ డివిజన్‌ మ్యాచ్‌లు చెన్నైలో జరుగనున్నాయి. 
చదవండి: ఇంగ్లండ్‌ జట్టులో రెండు మార్పులు.. బట్లర్‌ సహా మరో బౌలర్‌ ఔట్‌

మరిన్ని వార్తలు