Ranji Trophy 2022-23: చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన అనంతరం బ్యాట్‌తోనూ ఇరగదీసిన ఉనద్కత్‌

5 Jan, 2023 16:35 IST|Sakshi

Jaydev Unadkat: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్‌, భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ ఇరగదీస్తున్నాడు. తొలి ఓవర్‌లో హ్యాట్రిక్‌తో పాటు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి చారిత్రక ప్రదర్శన కనబర్చిన ఉనద్కత్‌.. ఆతర్వాత బ్యాట్‌తోనూ విజృంభించి ఆల్‌రౌండర్‌గా, సమర్ధవంత నాయకుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు.

అప్పటికే (మూడో రోజు ఆటలో) హార్విక్‌ దేశాయ్‌ (107), వసవద (152 నాటౌట్‌) సెంచరీలతో.. చిరాగ్‌ జానీ (75), సమర్థ్‌ వ్యాస్‌ (54), ప్రేరక్‌ మన్కడ్‌ (64) అర్ధసెంచరీలతో అలరించగా, 8వ స్థానంలో బరిలోకి దిగిన ఉనద్కత్‌ తాను సైతం అంటూ 52 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ మొత్తంలో 68 బంతులు ఎదుర్కొన్న ఉనద్కత్‌.. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆ తర్వాత 2 బంతులకే మరో వికెట్‌ పడటంతో ఉనద్కత్‌.. 574/8 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. ఫలితంగా సౌరాష్ట్రకు 441 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ.. మూడో సెషన్‌ సమయానికి 6 వికెట్ల నష్టానికి కేవలం 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో చుక్కలు చూపించిన ఉనద్కత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క ​వికెట్‌ కూడా పడగొట్ట లేకపోవడం విశేషం. యువరాజ్‌సింగ్‌ దోడియ 4 వికెట్లు పడగొట్టగా.. పార్థ్‌ బట్‌, చిరాగ్‌ జానీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

తొలి ఇన్నింగ్సలో 9వ స్థానంలో అర్ధసెంచరీతో ఢిల్లీ పరువు కాపాడిన హృతిక్‌ షోకీన్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీ చేసి ఆ జట్టు మరోసారి పేకమేడలా కూలకుండా కాపాడాడు. జాంటీ సిద్దు (17), లక్ష్యయ్‌ తరేజా (0) క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఉనద్కత్‌ ధాటికి 10 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌ దిశగా సాగిన ఢిల్లీ జట్టు పరువును ప్రాణ్షు విజయరన్‌ (15), షోకీన్‌ (68 నాటౌట్‌), శివాంక్‌ వశిష్ట్‌ (38) కాపాడారు. ఈ ముగ్గురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్‌ చేయడంతో ఢిల్లీ 133 పరుగులు చేసి ఆలౌటైంది. ఉనద్కత్‌ (8/39)కు జతగా చిరాగ్‌ జానీ (1/14), ప్రేరక్‌ మన్కడ్‌ (1/2) రాణించారు.  

మరిన్ని వార్తలు