Ranji Trophy 2022-23: తృటిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న రహానే

11 Jan, 2023 15:25 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ముంబై కెప్టెన్‌, టీమిండియా ఆటగాడు ఆజింక్య రహానే సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ డబుల్‌ సెంచరీ (హైదరాబాద్‌పై 204 పరుగులు) నమోదు చేసిన రహానే.. తాజాగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తృటిలో మరో డబుల్‌ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 302 బంతులను ఎదుర్కొన్న రహానే 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 191 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరో ఎండ్‌లో ఓపెనర్‌ పృథ్వీ షా రికార్డు స్థాయిలో 379 పరుగులు చేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 687 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో ముషీర్‌ ఖాన్‌ (42). అర్మాన్‌ జాఫర్‌ (27), సర్ఫరాజ్‌ ఖాన్‌ (28 నాటౌట్‌) సైతం ఓ మోస్తరు స్కోర్లు సాధించారు. అస్సాం బౌలర్లలో రియాన్‌ పరాగ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ముక్తర్‌ హుస్సేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం 28 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసిం‍ది. ఓపెనర్‌ శుభమ్‌ మండల్‌ (40) మోహిత్‌ అవస్తి బౌలింగ్‌లో ప్రసాద్‌ పవార్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కాగా.. మరో ఓపెనర్‌ రాహుల్‌ హజారికా (42), రిషవ్‌ దాస్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. అస్సాం, ముంబై తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 587 పరుగులు వెనుకపడి ఉంది.

మరిన్ని వార్తలు