Ranji Trophy 2022-23: రాణించిన విహారి, రాయుడు.. ఆంధ్ర ఖాతాలో మరో విజయం

26 Jan, 2023 16:00 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్‌ దశలో (ఎలైట్‌ గ్రూప్‌-బి) ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకుని, ప్రస్తుతానికి గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. గ్రూప్‌ దశలో ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర టీమ్‌.. అస్సాంపై ఇన్నింగ్స్‌ 95 పరుగుల తేడాతో గెలుపొంది, క్వార్టర్స్‌ రేసులో ముందుంది. ఈ మ్యాచ్‌ను ఆంధ్ర టీమ్‌ కేవలం రెండున్నర రోజుల్లో ముగించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర.. అభిషేక్‌ రెడ్డి (75), కెప్టెన్‌ హనుమ విహారీ (80), కరణ్‌ షిండే (90 నాటౌట్‌) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులకు ఆలౌటైంది. అస్సాం బౌలర్లలో పుర్ఖాయస్తా 4, రియాన్‌ పరాగ్‌, సిద్దార్థ్‌ సర్మా తలో 2, ముఖ్తార్‌ హుస్సేన్‌, హ్రిదీప్‌ దేకా చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం టీమ్‌.. మాధవ్‌ రాయుడు (4/12), శశికాంత్‌ (3/34), నితీశ్‌ రెడ్డి (1/29), మోహన్‌ (1/24) ధాటికి 113 పరుగులకే కుప్పకూలి, ఫాలో ఆన్‌ ఆడింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ అస్సాం ఆటతీరు ఏమాత్రం మారలేదు. లలిత్‌ మోహన్‌ (5/40), షోయబ్‌ ఖాన్‌ (2/30), మాధవ్‌ రాయుడు (2/34) దెబ్బకు అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలై, సీజన్‌ను ముగించింది. 6 వికెట్లతో సత్తా చాటిన మాధవ్‌ రాయుడుకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా, ప్రస్తుత సీజన్‌లో బెంగాల్‌, కర్ణాటక జట్లు ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ బెర్తులు ఖరారు చేసుకోగా మిగిలిన 6 బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

మరిన్ని వార్తలు