Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్‌ ఎప్పుడంటే!

13 Dec, 2022 08:16 IST|Sakshi
డిపెండింగ్‌ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌(PC: BCCI)

సాక్షి, హైదరాబాద్‌: భారత దేశవాళీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు మంగళవారం తెర లేవనుంది. 2022–2023 సీజన్‌కు సంబంధించి తొలి రౌండ్‌ గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లు వివిధ నగరాల్లో ప్రారంభం కానున్నాయి. మధ్యప్రదేశ్‌ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. మొత్తం 38 జట్లను ఐదు గ్రూప్‌లుగా విభజించారు.

లీగ్‌ దశ ముగింపు అప్పుడే
ఎలైట్‌ విభాగంలో ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’ గ్రూప్‌లు ఉండగా... ప్లేట్‌ డివిజన్‌ గ్రూప్‌ వేరుగా ఉంది. ఎలైట్‌ విభాగంలోని నాలుగు గ్రూపుల్లో ఎనిమిది జట్ల చొప్పున మొత్తం 32 జట్లకు...ప్లేట్‌ గ్రూప్‌లో ఆరు జట్లకు చోటు కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీతో గ్రూప్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఎలైట్‌ నాలుగు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

ఫైనల్‌ ఎప్పుడంటే!
జనవరి 31 నుంచి క్వార్టర్‌ ఫైనల్స్‌ను... ఫిబ్రవరి 8 నుంచి సెమీఫైనల్స్‌ను... ఫిబ్రవరి 16 నుంచి ఫైనల్‌ను నిర్వహిస్తారు. హైదరాబాద్, ఆంధ్ర జట్లు గ్రూప్‌ ‘బి’లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తమ తొలి రౌండ్‌ మ్యాచ్‌లను సొంతగడ్డపై ఆడనున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో తమిళనాడుతో హైదరాబాద్‌... విజయనగరంలో 41 సార్లు రంజీ చాంపియన్‌ ముంబైతో ఆంధ్ర తలపడనున్నాయి. 

ఎలైట్‌ గ్రూప్‌ల వివరాలు 
గ్రూప్‌ ‘ఎ’: హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బరోడా, ఒడిషా, ఉత్తరాఖండ్, నాగాలాండ్‌. 
గ్రూప్‌ ‘బి’: హైదరాబాద్, ఆంధ్ర, ముంబై, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, అస్సాం.  
గ్రూప్‌ ‘సి’: కర్ణాటక, కేరళ, జార్ఖండ్, గోవా, రాజస్తాన్, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, సర్వీసెస్‌. 
గ్రూప్‌ ‘డి’: మధ్యప్రదేశ్, విదర్భ పంజాబ్,, రైల్వేస్, గుజరాత్, త్రిపుర, జమ్మూ కశ్మీర్, చంఢీగఢ్‌. 
ప్లేట్‌ గ్రూప్‌: బిహార్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ.   

చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్‌! ఆల్‌రౌండర్‌ అరంగేట్రం
FIFA WC 2022: క్రొయేషియాతో సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాకిచ్చిన ఫిఫా

మరిన్ని వార్తలు