Ravindra Jadeja: రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా.. ఏకంగా 8 వికెట్లతో..!

26 Jan, 2023 19:30 IST|Sakshi

Ranji Trophy 2022-23: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రీ ఎంట్రీలో దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడ్డూ భాయ్‌.. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చాటాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జడ్డూ.. రంజీల్లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. తదనుగుణంగానే సెలెక్టర్లు సైతం అతనికి రంజీల్లో ఆడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో జడేజా వచ్చీ రాగానే బంతితో తన ప్రతాపం చూపాడు.

ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీసి, బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించిన జడ్డూ (35 బంతుల్లో 22 నాటౌట్‌; 2 ఫోర్లు).. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా 7 వికెట్లు తీసి తమిళనాడు వెన్నువిరిచాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేసింది. జడేజాకు జతగా మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్‌) 3 వికెట్లతో రాణించడంతో పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన తమిళనాడు తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. తమిళనాడు సెకెండ్‌ ఇన్నంగ్స్‌లో సాయ్‌ సుదర్శన్‌ (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌట్‌ కాగా.. సౌరాష్ట్ర 192 పరుగులకే చాపచుట్టేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 4 పరుగులు చేసింది. సౌరాష్ట్ర గెలవాలంటే ఆఖరి రోజు మరో 262 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. క్వార్టర్స్‌కు చేరాలంటే సౌరాష్ట్రకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. జడేజా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి తన జట్టును క్వార్టర్స్‌కు చేరుస్తాడేమో వేచి చూడాలి. ఏదిఏమైనా  ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు జడేజా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభసూచకం  
 

మరిన్ని వార్తలు