Ranji Trophy 2022-23: 24 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోసిన రుతురాజ్‌

11 Jan, 2023 16:58 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా తమిళనాడుతో నిన్న (అక్టోబర్‌ 10) ప్రారంభమైన ఎలైట్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌లో మహారాష్ట్ర ఓపెనర్‌, టీమిండియా ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉగ్రరూపం దాల్చాడు. తొలి రోజు ఆటలోనే సెంచరీ పూర్తి చేసిన ఈ పూణే కుర్రాడు.. రెండో రోజు ఆటలో మరింత చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 184 బంతులను ఎదుర్కొన్న రుతురాజ్‌ 24 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 195 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

రుతురాజ్‌కు జతగా గత మ్యాచ్‌ డబుల్‌ సెంచరీ హీరో కేదార్‌ జాదవ్‌ (56), అజిమ్‌ ఖాజీ (88) అర్ధసెంచరీలతో రాణించడంతో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. విఘ్నేశ్‌, సాయ్‌ కిషోర్‌ తలో 2 వికెట్లు, క్రిస్ట్‌, విజయ్‌ శంకర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తమిళనాడు.. 49 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. జగదీశన్‌ (77) అర్ధసెంచరీతో రాణించగా.. బాబా అపరాజిత్‌ (20), బాబా ఇంద్రజిత్‌ (47) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్‌ సాయ్‌ సుదర్శన్‌ డకౌటై నిరశపర్చగా.. ప్రస్తుతం ప్రదోశ్‌ పాల్‌ (33), విజయ్‌ శంకర్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు.. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 238 పరుగులు వెనుకపడి ఉంది. మహా బౌలర్లలో ప్రదీప్‌ దడే 2 వికెట్లు పడగొట్టగా.. రాజవర్ధన్‌ హంగేర్కర్‌, సత్యజిత్‌ బచ్చవ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

మరిన్ని వార్తలు