మరోసారి రెచ్చిపోయిన సంజూ శాంసన్‌.. ప్రయోజనం లేదంటున్న ఫ్యాన్స్‌

21 Dec, 2022 16:27 IST|Sakshi

Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో కేరళ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ వరుస హాఫ్‌ సెంచరీలతో దూసుకుపోతున్నాడు. జార్ఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్లాస్టింగ్‌ ఇన్నింగ్స్‌ (108 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆడిన సంజూ.. తాజాగా రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే తరహాలో రెచ్చిపోయాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 108 బంతులు ఎదుర్కొన్న అతను.. 14 ఫోర్ల సాయంతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. సంజూతో పాటు సచిన్‌ బేబి (67 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు (50 ఓవర్లు) చేసింది.

ఓపెనర్లు పొన్నన్‌ రాహుల్‌ (10), రోహన్‌ ప్రేమ్‌ (18) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. షౌన్‌ రోజర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సచిన్‌కు జతగా అక్షయ్‌ చంద్రన్‌ (3) క్రీజ్‌లో ఉన్నాడు. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌.. దీపక్‌ హుడా (133) సెంచరీతో, యశ్‌ కొఠారీ (58), సల్మాన్‌ ఖాన్‌ (74) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకే ఆలౌటైంది. కేరళ బౌలర్లలో బాసిల్‌ థంపి, జలజ్‌ సక్సేనా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. నిధీశ్‌, ఫజిల్‌ ఫనూస్‌, సిజోమోన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఇదిలా ఉంటే, సంజూ శాంసన్‌ రంజీల్లో వరుస అర్ధశతకాలతో రాణించడంపై అతని ఫ్యాన్స్‌ స్పందిస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రాణిస్తేనే చోటివ్వని భారత సెలెక్టర్లు.. రంజీల్లో హాఫ్‌ సెంచరీలు బాదితే జాతీయ జట్టులో చోటిస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. సంజూ హాఫ్‌ సెంచరీలు కాదు ట్రిపుల్‌ సెంచరీలు కొట్టినా టీమిండియా యాజమాన్యం కరుణించదంటూ మరికొందరు వైరాగ్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.

ఎంత టాలెంట్‌ ఉన్నా, ఎన్ని పరుగులు చేసినా, అభిమానుల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా సెలెక్టర్లు మాత్రం సంజూను జాతీయ జట్టుకు ఎంపిక చేయరని, కొద్ది రోజుల కిందటి వరకు సంజూకు పంత్‌ ఒక్కడే అడ్డంగా ఉండేవాడని, కొత్తగా ఇషాన్‌ కిషన్‌ కూడా తమ ఫేవరెట్‌ క్రికెటర్‌కు అడ్డుగా తయారయ్యాడని  సంజూ హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు