Ranji Trophy 2022-23: ఉనద్కత్‌ ఉగ్రరూపం.. రంజీ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర

19 Feb, 2023 12:34 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర అవతరించింది. గత మూడో సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019-20 సీజన్‌లో సైతం జయదేవ్‌ ఉనద్కత్‌ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో గత నాలుగు రోజులుగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర.. లోకల్‌ టీమ్‌ బెంగాల్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆఖరి రోజు (ఫిబ్రవరి 19) లోకల్‌ హీరో, బెంగాల్‌ కెప్టెన్‌, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్‌ తివారి (68) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

ఉనద్కత్‌ ఉగ్రరూపం దాల్చడంతో బెంగాల్‌ టీమ్‌ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్‌కు జతగా చేతన్‌ సకారియా (3/76) కూడా రాణించడంతో సౌరాష్ట్ర.. బెంగాల్‌ను సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్‌ చేసింది. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. కేవలం 2.4 ఓవర్లలో జై గోహిల్‌ (0) వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జై వికెట్‌ను ఆకాశ్‌దీప్‌ దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌరాష్ట్ర.. తొలుత బెంగాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉనద్కత్‌ (3/44), చేతన్‌ సకారియా (3/33), చిరాగ్‌ జానీ (2/33), డి జడేజా (2/19) చెలరేగడంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్‌ ఆహ్మద్‌ (69), అభిషేక్‌ పోరెల్‌ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర.. హార్విక్‌ దేశాయ్‌ (50), షెల్డన్‌ జాక్సన్‌ (59), వసవద (81), చిరాగ్‌ జానీ (60) అర్ధసెంచరీలతో రాణించడంతో 404 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది.

బెంగాల్‌ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 4, ఆకాశ్‌దీప్‌, ఇషాన్‌ పోరెల్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు. 230 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బెంగాల్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌటైంది. మజుందార్‌ (61), మనోజ్‌ తివారి (68) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉనద్కత్‌ (6/85), సకారియా (3/76) బెంగాల్‌ పతనాన్ని శాశించారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. వికెట్‌ నష్టానికి 14 పరుగులు చేసి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. 


 

మరిన్ని వార్తలు