Ranji Trophy 2022-23: ఆరేసిన ఉనద్కత్‌.. హైదరాబాద్‌కు మరో ఘోర పరాభవం

11 Jan, 2023 16:35 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో జయదేవ్‌ ఉనద్కత్‌ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గత ఏడాది చివర్లో మొదలైన ఈ జట్టు జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2022 డిసెంబర్‌లో ముంబైపై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌరాష్ట్ర.. గత వారం ఢిల్లీని ఇన్నింగ్స్‌ 214 పరుగుల తేడాతో, తాజాగా హైదరాబాద్‌ను ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రస్తుత సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (8/39, 70) చెలరేగిన ఉనద్కత్‌.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఆరు వికెట్లు (3/28, 3/62) పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఉనద్కత్‌కు జతగా ధరేంద్రసిన్హ్‌ జడేజా (3/8, 4/34, 40 పరుగులు) కూడా రాణించడంతో సౌరాష్ట్ర ప్రస్తుత రంజీ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌.. ఉనద్కత్‌ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్‌ దోడియా (2/23), చేతన్‌​ సకారియా (1/8) చిరాగ్‌ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్‌ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ రాయుడు (23), భగత్‌ వర్మ (11), అనికేత్‌ రెడ్డి (10 నాటౌట్‌)లు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర.. చిరాగ్‌ జానీ (68), హార్విక్‌ దేశాయ్‌ (81), షెల్డన్‌ జాక్సన్‌ (59) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌ రెడ్డి 7 వికెట్లు పడగొట్టగా.. రోహిత్‌ రాయుడు 2, అబ్రార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

హైదరాబాద్‌ బ్యాటింగ్‌ తీరు రెండో ఇన్నింగ్స్‌లోనూ మారలేదు. జడేజా (4/34), ఉనద్కత్‌ (3/62), దోడియా (2/76), సకారియా (1/13) విజృంభించడంతో ఆ జట్టు 191 పరుగులకే కుప్పకూలింది. సంతోష్‌ గౌడ్‌ (58) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబద్‌ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. 

గతేడాది డిసెంబర్‌లో ముంబై చేతిలో ఇన్నింగ్స్‌ 217 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఈ జట్టు.. ఆ తర్వాత అస్సాం చేతిలో (18 పరుగుల తేడాతో), ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ చేతిలో (154 పరుగుల తేడాతో), తాజాగా సౌరాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. 

మరిన్ని వార్తలు