వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్‌ ఊచకోత కొనసాగింపు

20 Dec, 2022 17:09 IST|Sakshi

Ranji Trophy 2022-23: బంగ్లాదేశ్‌ టూర్‌కు వెళ్లకుండా కొద్ది రోజులు విరామం తీసుకున్న టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌తో ఇవాళ (డిసెంబర్‌ 20) మొదలైన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే తన మార్క్‌ నాటుకొట్టుడును ప్రారంభించిన స్కై.. మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తూ హైదరాబాద్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 90 పరుగులు చేశాడు. 112.50 స్ట్రయిక్‌ రేట్‌తో హైదరాబాద్‌ బౌలర్లను ఎడాపెడా వాయించిన మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌.. 10 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సూర్యకుమార్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (162), కెప్టెన్‌ అజింక్య రహానే (108 నాటౌట్‌)లు శతకాలతో చెలరేగడంతో 75 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 396 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రహానేకు జతగా సర్ఫరాజ్‌ ఖాన్‌ (10) క్రీజ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌ బౌలర్లలో శశాంక్‌ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీకేయ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

కాగా, ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబై.. ఆంధ్రప్రదేశ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందగా.. హైదరాబాద్‌ తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు