Ranji Trophy 2022-23: భారీ ద్విశతకం బాదిన ధోని ఫ్రెండ్‌.. 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో విధ్వంసం

5 Jan, 2023 15:31 IST|Sakshi

Kedar Jadhav: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌, ఎంఎస్‌ ధోనికి అత్యంత సన్నిహితుడు, మహారాష్ట్ర ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌.. లేటు వయసులో వీర లెవెల్లో రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ ద్విశతకం బాదిన కేదార్‌ అభిమానులకు టీ20 మజాను అందించి అబ్బురపరిచాడు.

ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కేజే.. 283 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు చేశాడు. 37 ఏళ్ల కేదార్‌ జాదవ్‌.. ఈ మ్యాచ్‌లో మరో 17 పరుగులు చేసుంటే కెరీర్‌లో రెండో ట్రిపుల్‌ సెంచరీ సాధించడంతో పాటు లేటు వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కేవాడు.

ఇప్పటి వరకు 78 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన కేదార్‌.. 45.72 సగటున 14 సెంచరీలు, 20 అర్ధసెంచరీ సాయంతో 5166 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్‌ 327 పరుగులుగా ఉంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన కేదార్‌.. 73 వన్డేల్లో 42.09 సగటున 2 శతకాలు, 6 అర్ధశతకాల సాయంతో 1389 పరుగులు చేశాడు.

ఈ మహారాష్ట్ర ఆటగాడు టీ20ల్లో, ఐపీఎల్‌లోనూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు. కొద్దికాలం పాటు టీమిండియాలో ధోనితో ప్రయాణం సాగించిన కేదార్‌.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యుడిగా చాలాకాలం పాటు కొనసాగాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అస్సాం.. పురకాయస్త (65), ఆకాశ్‌సేన్‌ గుప్త (65) అర్ధశతకాలతో రాణిం‍చడంతో తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర బౌలర్లలో అశయ్‌ పాల్కర్‌, దడే తలో 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్‌ ఇంగలే, బచ్చవ్‌ చెరో 2 వికెట్లు సాధించారు. 

అనంతరం బరిలోకి దిగిన మహారాష్ట్ర.. సిద్దేశ్‌ వీర్‌ (106) శతకంతో, కేదార్‌ జాదవ్‌ (283) భారీ ద్విశతకంతో రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌ను 594/9 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. అస్సాం బౌలర్లలో రియాన్‌ పరాగ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ముక్తార్‌ హుస్సేన్‌ 2, రంజిత్‌ మాలి ఓ వికెట్‌ దక్కించుకున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన మహారాష్ట్ర 320 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో ఉంది. 


 

మరిన్ని వార్తలు