Ranji Trophy 2022 Final: అర్థ సెంచరీతో ఆకట్టుకున్న జైశ్వాల్‌.. తొలి రోజు ముగిసిన ఆట

22 Jun, 2022 17:22 IST|Sakshi

ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ 2022లో భాగంగా ముంబై, మధ్య ప్రదేశ్‌ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసింది. మొదటిరోజు ముగిసే సమయానికి ముంబై 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్‌లో యశస్వి జైశ్వాల్‌(163 బంతుల్లో 78 పరుగులు, 7 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో రాణించాడు. కీలకమైన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపిన యశస్వి అదే ఫామ్‌ను ఫైనల్‌లోనూ కంటిన్యూ చేశాడు.

జైశ్వాల్‌కు.. మరో ఓపెనర్‌ కెప్టెన్‌ పృథ్వీ షా 47 పరుగులతో సహకరించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. పృథ్వీ షా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆర్మాన్‌ జాఫర్‌(26), సువేద్‌ పార్కర్‌(18) పెద్దగా రాణించలేకపోయారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ యశస్వికి జత కలిశాడు. అయితే 78 పరుగులు చేసిన జైశ్వాల్‌ ఔట్‌ కావడంతో ముంబై 185 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన వికెట్‌ కీపర్‌ హార్దిక్‌ తామోర్‌ 24 పరుగులు చేసి ఔటవ్వడంతో ముంబై 228 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది.

అనంతరం వచ్చిన షామ్స్‌ ములానీ(12 పరుగులు బ్యాటింగ్‌‌)తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌(125 బంతుల్లో 40 పరుగులు బ్యాటింగ్‌) 5 వికెట్ల నష్టానికి 248 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించాడు. మధ్య ప్రదేశ్‌ బౌలర్లలో అనుభవ్‌ అగర్వాల్‌, సారాన్ష్‌ జైన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. కుమార్‌ కార్తికేయ ఒక వికెట్‌ తీశాడు. ఇక ముంబై రంజీలో 47వ సారి ఫైనల్‌కు చేరుకోగా.. మధ్య ప్రదేశ్‌ మాత్రం 23 ఏళ్ల తర్వాత రెండో సారి రంజీ ట్రోపీ ఫైనల్లో అడుగుపెట్టింది. 

చదవండి: Rumeli Dhar Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ గుడ్‌ బై

మరిన్ని వార్తలు