Ranji Trophy 2022: పేలిన జార్ఖండ్‌ డైనమైట్లు.. రంజీ చరిత్రలో భారీ స్కోర్‌ నమోదు

14 Mar, 2022 19:10 IST|Sakshi

రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగో అత్యధిక టీమ్‌ స్కోర్‌ నమోదైంది. 2022 సీజన్‌లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌ మ్యాచ్‌లో జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 880 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. టోర్నీ చరిత్రలో హైదరాబాద్‌ (1993/94 సీజన్‌లో ఆంధ్రపై 944/6) పేరిట అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు ఉండగా, రెండో అత్యధిక టీమ్‌ స్కోర్‌ తమిళనాడు (912/6), మూడో అత్యధిక స్కోర్‌ మధ్యప్రదేశ్‌ (912/6) పేరిట నమోదై ఉంది. తాజాగా జార్ఖండ్‌ 31 ఏళ్ల కిందట (1990/91) ముంబై చేసిన 855/ 6 పరుగుల రికార్డును బద్దలు కొట్టి, టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్‌ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 


ఝర్ఖాండ్‌ సాధించిన ఈ రికార్డు స్కోర్‌లో 3 శతకాలు, 3 అర్ధ శతకాలు నమోదు కాగా, ఇందులో ఓ ద్విశతకం, ఓ భారీ శతకం ఉంది. 17 ఏళ్ల యువ వికెట్‌కీపర్‌, 2020 భారత అండర్‌ 19 ప్రపంచకప్‌ జట్టు సభ్యుడు కుమార్‌ కుశాగ్రా డబుల్‌ సెంచరీ (270 బంతుల్లో 266; 37 ఫోర్లు, 2 సిక్సర్లు)తో విరుచుకుపడగా, నదీమ్‌ (304 బంతుల్లో 177; 22 ఫోర్లు, 2సిక్సర్లు), విరాట్‌ సింగ్‌ (153 బంతుల్లో 107; 13 ఫోర్లు)లు శతకాలు బాదారు. 

కుమార్‌ సూరజ్‌ (92 బంతుల్లో 69; 11 ఫోర్లు, సిక్స్‌), అంకుల్‌ రాయ్‌ (88 బంతుల్లో 59; 7 ఫోర్లు), రాహుల్‌ శుక్లా (149 బంతుల్లో 85 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిలో రాహుల్‌ శుక్లా 11వ నంబర్‌ ఆటగాడిగా వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి అజేయ అర్ధ సెంచరీ సాధించడం విశేషం. జార్ఖండ్‌ ఇన్నింగ్స్‌ అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.   
చదవండి: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్‌ కైవసం
 

మరిన్ని వార్తలు