Taruwar Kohli: రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న మరో కోహ్లి.. 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు

7 Mar, 2022 21:50 IST|Sakshi

Taruwar Kohli Shines In Ranji Trophy 2022: ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో మిజోరం కెప్టెన్‌ తరువార్‌ కోహ్లి పేరు మార్మోగిపోతుంది. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మాజీ సహచరుడైన ఈ కోహ్లి రంజీ ట్రోఫీ 2022లో పరుగుల వరద పారిస్తూ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 526 పరుగులు స్కోర్‌ చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ, 3 సెంచరీలు ఉన్నాయి.


బీహార్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు (151, 101 నాటౌట్‌, వికెట్‌) బాదిన కోహ్లి, మణిపూర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, 22 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో పాటు అర్ధ సెంచరీ (69 పరుగులు) కూడా సాధించాడు. 


ఇక నాగాలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కోహ్లి మరోసారి రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లతో పాటు 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌తో పాటు మరో భారీ శతకాన్ని (151 నాటౌట్‌) బాదాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 51.02 సగటుతో 3827 పరుగులు చేశాడు.


రంజీల్లో పంజాబ్‌ తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంకు వలస వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మిజోరం యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. కాగా, 33 ఏళ్ల తరువార్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, జాతీయ స్థాయిలో ఆశించిన అవకాశాలు రాకకపోవడంతో దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. 

చదవండి: రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై దిగ్గజ క్రికెటర్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు