Ranji Trophy 2024: రెచ్చిపోయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్లు

16 Feb, 2024 21:02 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 16) మొదలైన వేర్వేరు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌ ఇరగదీశారు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (మహారాష్ట్ర) తృటిలో సెంచరీ (96) చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్‌ దూబే మెరుపు శతకంతో (95 బంతుల్లో 101 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్‌కే ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బంతితో వీరవిహారం చేశాడు. శార్దూల్‌ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 

ఇలా ఒకే రోజు ముగ్గురు సీఎస్‌కే ఆటగాళ్లు సత్తా చాటడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ఈసారి కూడా ప్రత్యర్దులకు దబిడిదిబిడే అంటూ రచ్చ చేస్తున్నారు. సీఎస్‌కే ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టైటిల్‌ నిలబెట్టుకోవడం​ ఖాయమని కామెంట్స్‌ చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్‌లో ధోని నేతృత్వంలో సీఎస్‌కే ఐదో సారి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాబోయే సీజన్‌కు సంబంధించి సీఎస్‌కే ఇప్పటికే ట్రైనింగ్‌ ‍క్యాంప్‌ను స్టార్ట్‌ చేసింది. కెప్టెన్‌ ధోనితో పాటు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో క్యాంప్‌ నడుస్తుంది. 

కాగా, సీఎస్‌కే ఆటగాళ్లు రాణించడంతో అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పట్టుబిగించింది. శార్దూల్‌ ఠాకూర్‌ ఆరేయడంతో అసోం తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 101 పరుగులతో దూబే, 2 పరుగులతో శార్దూల్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 133 పరుగుల లీడ్‌లో ఉంది.

సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్‌ రాణించినప్పటికీ మహారాష్ట్ర తడబడింది. సర్వీసెస్‌ బౌలర్లు అర్జున్‌ శర్మ (5/59), వరుణ్‌ చౌదరీ (4/39) విజృంభించడంతో ముంబై 225 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సర్వీసెస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.     

whatsapp channel

మరిన్ని వార్తలు