తమిళనాడును చిత్తు చేసిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశం​

4 Mar, 2024 16:11 IST|Sakshi

ముంబై క్రికెట్‌ జట్టు రంజీ ట్రోఫీలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ జట్టు రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఏ జట్టు ఇన్ని సార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు.

ముంబై తర్వాత ఆత్యధికంగా (14) కర్ణాటక/మైసూర్‌ ఫైనల్స్‌కు చేరింది. ఈ రెండు జట్ల తర్వాత ఢిల్లీ (15), మధ్యప్రదేశ్‌/హోల్కర్‌ (12), బరోడా (9), సౌరాష్ట్ర (5), విదర్భ (2), బెంగాల్‌ (15), తమిళనాడు/మద్రాస్‌ (12), రాజస్థాన్‌ (10), హైదరాబాద్‌ (5) అత్యధిక సార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.

దేశవాలీ టోర్నీలో 48 సార్లు ఫైనల్స్‌కు చేరిన ముంబై ఏ జట్టుకు ఊహకు సైతం అందని విధంగా 41 సార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర ఉంది. ఈ జట్టు అనూహ్య రీతిలో క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇవాళ (మార్చి 4) ముగిసిన రెండో సెమీఫైనల్లో ముంబై తమిళనాడును ఇన్నింగ్స్‌ 70 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శార్దూల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండ్‌ షోతో (109, 4 వికెట్లు) ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. శార్దూల్‌ ఠాకూర్‌ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సైతం చేతులెత్తేసిన తమిళనాడు 162 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న శార్దూల్‌ ఠాకూర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. మరోవైపు మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ 199 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆట మూడో రోజు కొనసాగుతుంది. 


 

whatsapp channel

మరిన్ని వార్తలు