Ranji Trophy: ముంబై- మహారాష్ట్ర మ్యాచ్‌ డ్రా.. క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్ర

28 Jan, 2023 09:46 IST|Sakshi
హనుమ విహారి

Ranji Trophy 2022-23 : రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా గ్రూప్‌ ‘బి’లో మహారాష్ట్ర, ముంబై మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. దీంతో హనుమ విహారి సారథ్యంలోని ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర తలపడుతుంది.  

ముంబై మ్యాచ్‌లో
కాగా బ్రబౌర్న్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్‌ అయింది. ముంబై సైతం 384 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ ముగించడం విశేషం.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 252 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆట ముగిసే సమయానికి ముంబై 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఫలితం తేలకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

అసోంపై
ఇదిలా ఉంటే.. అంతకుముందు అసోంపై ఆంధ్ర జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. అభిషేక్‌రెడ్డి (75), కెప్టెన్‌ హనుమ విహారీ(80), కరణ్‌ షిండే(నాటౌట్‌) రాణించడంతో 361 పరుగులు స్కోరు చేసింది.

ఇక ఆంధ్ర బౌలర్లు మాధవ్‌ రాయుడు (4/12), శశికాంత్‌ (3/34), నితీశ్‌ రెడ్డి (1/29), మోహన్‌ (1/24) చెలరేగడంతో అసోం 113 పరుగులకే కుప్పకూలి, ఫాలో ఆన్‌ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. దీంతో ఆంధ్ర జట్టు ఘన విజయం సాధించి క్వార్టర్‌ రేసులో నిలవగా.. ముంబై- మహారాష్ట్ర ఫలితంతో క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఆరో ఓటమితో అధోగతి.. ‘ప్లేట్‌’ డివిజన్‌కు హైదరాబాద్‌  
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు పేలవ ప్రదర్శన చివరి మ్యాచ్‌ వరకూ కొనసాగింది. శుక్రవారం ముగిసిన ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో తన్మయ్‌ అగర్వాల్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 90/5తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే కుప్పకూలింది.  అనంతరం 47 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ వికెట్‌ నష్టపోయి ఛేదించింది. దీంతో సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌లలో వరుసగా ఆరో ఓటమితో  హైదరాబాద్‌ ఒక పాయింట్‌తో చివరి స్థానంలో నిలిచి ‘ప్లేట్‌’ గ్రూప్‌నకు పడిపోయింది.

చదవండి: Arshdeep Singh: ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్‌ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు
 IND Vs NZ: తొలి టి20లో టీమిండియా ఓటమి..
 

మరిన్ని వార్తలు