AP Vs HYD: రికీ, కరణ్‌ సెంచరీలు! చెలరేగిన శశికాంత్‌.. హైదరాబాద్‌పై ఆంధ్ర భారీ విజయం

6 Jan, 2023 15:52 IST|Sakshi
రికీ భుయ్‌, కరణ్‌ షిండే

Ranji Trophy 2022-23- Andhra vs Hyderabad: రంజీ ట్రోఫీ టోర్నీ 2022- 23లో భాగంగా ఆంధ్ర జట్టు హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. హనుమ విహారి బృందం 154 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. సెంచరీతో మెరిసిన రికీ భుయ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఎలైట్‌ గ్రూప్‌ బిలో భాగమైన ఆంధ్ర- హైదరాబాద్‌ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్‌ అయింది.

ఒక్కడు తప్ప.. అంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లే!
ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి (81 పరుగులు( మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఆంధ్ర బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 9 ,2, 6 ,5, 3, 4, 1, 13, 0, 1 నాటౌట్‌. హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ 5 వికెట్లతో చెలరేగగా.. రక్షణ్‌ రెడ్డి ఒకటి, కార్తికేయ మూడు వికెట్లు తీశారు.

ఇక హైదరాబాద్‌ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో 197 పరుగులకే ఆ జట్టు కథ ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసింది.

సెంచరీలతో మెరిసిన రికీ, కరణ్‌
ఓపెనర్‌ జ్ఞానేశ్వర్‌ 72, కెప్టెన్‌ హనుమ విహారి 33, రికీ భుయ్‌ 116, శ్రీకర్‌ భరత్‌ 89 పరుగులు సాధించగా.. కరణ్‌ షిండే 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, హైదరాబాద్‌ ఆంధ్రకు దీటుగా బదులివ్వలేక చతికిలపడింది.

చెలరేగిన శశికాంత్‌
చందన్‌ సహాని అర్ధ శతకం(56) సాధించగా రోహిత్‌ రాయుడు 46 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆంధ్ర బౌలర్‌ కేవీ శశికాంత్‌ 5 వికెట్లు కూల్చి హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. 

మిగతా వాళ్లలో కొడవండ్ల సుదర్శన్‌ మూడు, నితీశ్‌ రెడ్డి, షోయబ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో విజయనగరంలో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆంధ్ర 154 పరుగుల తేడాతో గెలుపొందింది. 

ఆంధ్ర వర్సెస్‌ హైదరాబాద్‌ స్కోర్లు
ఆంధ్ర- 135 & 462
హైదరాబాద్‌- 197 & 246

చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్‌
Rahul Tripathi: వైరల్‌.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్‌!

మరిన్ని వార్తలు