రంజీ ట్రోఫీకి బ్రేక్‌

31 Jan, 2021 01:24 IST|Sakshi
రంజీ ట్రోఫీతో డిఫెండింగ్‌ చాంపియన్‌ సౌరాష్ట్ర (ఫైల్‌)

ఈ సీజన్‌లో దేశవాళీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించలేమన్న బీసీసీఐ

87 ఏళ్లలో ఇదే తొలిసారి

విజయ్‌ హజారే వన్డే టోర్నీకి సంసిద్ధత

ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ (మూడు లేదా నాలుగు రోజుల మ్యాచ్‌లు) రంజీ ట్రోఫీకి 2020–2021 సీజన్‌లో బీసీసీఐ విరామమిచ్చింది. కరోనా కారణంగా ఈ సీజన్‌లో చాలా సమయం కోల్పోయిన కారణంగా తాజా సీజన్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించలేమని బీసీసీఐ ప్రకటించింది. 1934–35లో రంజీ ట్రోఫీ మొదలైన తర్వాత టోర్నీ నిర్వహించకపోవడం ఇదే తొలిసారి. ‘ఆటగాళ్లు, సెలక్షన్‌ కమిటీ, రాష్ట్ర సంఘాలతో రంజీ ట్రోఫీ నిర్వహణపై చర్చించాం. అయితే 2020 ఇప్పటికే ముగిసిపోగా... ప్రస్తుత సంవత్సరంలోనే కొత్త సీజన్‌ క్యాలెండర్‌లో మళ్లీ రంజీ ట్రోఫీ జరపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌కు రంజీ ట్రోఫీని పక్కన పెట్టాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దానికి బదులుగా పరిమిత ఓవర్ల టోర్నీలు నిర్వహించడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఏజీఎంలో రంజీ ట్రోఫీని కచ్చితంగా నిర్వహిస్తామని ప్రకటించిన బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆ విషయంలో పట్టుదల కనబర్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు నిర్వహించలేమని వివిధ రాష్ట్ర సంఘాలు స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. 2019–2020 సీజన్‌కుగాను రంజీ ట్రోఫీ టైటిల్‌ను సౌరాష్ట్ర జట్టు గెల్చుకుంది.  

మహిళలకు వన్డే టోర్నీ...
తాజా సీజన్‌లో రంజీ ట్రోఫీని పక్కన పెట్టిన బీసీసీఐ మరో మూడు టోర్నీలను మాత్రం అధికారికంగా ప్రకటించింది. టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ తరహాలోనే ‘బయో బబుల్‌’లో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరిగే అండర్‌–19 ప్రపంచకప్‌ టోర్నీని దృష్టిలో ఉంచుకొని దేశవాళీ అండర్‌–19 టోర్నీని (వినూ మన్కడ్‌ ట్రోఫీ) కూడా బోర్డు నిర్వహిస్తుంది. వీటితో పాటు మహిళల వన్డే టోర్నమెంట్‌ను కూడా జరుపుతామని బోర్డు ప్రకటించింది. అయితే ఈ మూడు టోర్నీల తేదీలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆడబోయే సిరీస్‌ల విషయంలో కూడా బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన అన్ని టోర్నీలు, సిరీస్‌లు కరోనా కారణంగా రద్దయ్యాయి. 2020 మార్చి 8న జరిగిన టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత మన మహిళల జట్టు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు!

తమిళనాడు X బరోడా
అహ్మదాబాద్‌: దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండు మాజీ చాంపియన్‌ జట్లు తమిళనాడు, బరోడా నేడు జరిగే తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఈ రెండు జట్లు ఫైనల్‌ చేరుకోవడం విశేషం. దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన తమిళనాడు గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం ట్రోఫీని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు బరోడా జట్టు కూడా తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. బరోడా గెలిస్తే ముస్తాక్‌ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెల్చుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. బరోడా జట్టు 2012, 2014లలో... తమిళనాడు 2007లో చాంపియన్‌గా నిలిచాయి.
 

మరిన్ని వార్తలు