Ranji Final 2022: తొలిసారి రంజీ ట్రోఫీ అందుకోనున్న మధ్యప్రదేశ్..!

25 Jun, 2022 20:38 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ రంజీ జట్టు చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది. ఫైనల్లో ముంబైపై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం (162 పరుగులు) సాధించడం ద్వారా ఆ జట్టు తొలి రంజీ టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. రజత్ పాటిదార్ (219 బంతుల్లో 122; 20 ఫోర్లు) సూపర్‌ శతకంతో మధ్యప్రదేశ్ విజయానికి బాటలు వేశాడు. నాలుగో రోజు ఆటలో పాటిదార్‌ ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని తన జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించాడు. కాగా, రంజీల్లో మ్యాచ్‌ ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే.

368 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన మధ్యప్రదేశ్ మరో 7 పరుగులు చేసి లీడ్‌ను సాధించి 536 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ముంబై ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకే ఆలౌటైన విషయం విధితమే. 

ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్‌ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేదు. 1998-99 సీజన్‌లో ఆ జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆ సీజన్‌ ఫైనల్‌లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించినప్పటికీ.. ఆఖరి రోజు ఆఖరి సెషన్‌లో అనూహ్యంగా కుప్పకూలి ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక, ప్రస్తుత సీజన్‌ ఫైనల్‌ విషయానికొస్తే ఏదో అద్భుతం జరిగితే తప్ప ముంబైకు విజయావకాశాలు లేవు. ముంబై చివరిరోజు ఆటలో మధ్యప్రదేశ్‌కు టార్గెట్‌ సెట్‌ చేసి ఆ జట్టును ఆలౌట్‌ చేయగలిగితేనే టైటిల్‌ సాధించే అవకాశం ఉంటుంది.
చదవండి: Ranji Trophy Final: వారెవ్వా.. రజత్‌ పాటిదార్‌.. సూపర్‌ సెంచరీ! ఇక
 

మరిన్ని వార్తలు