Hanuma Vihari: విహారి నువ్వు సూపరయ్యా.. మరోసారి ఒంటి చేత్తో, ఈసారి కత్తి పట్టిన యోధుడిలా..!

2 Feb, 2023 19:37 IST|Sakshi

Ranji Trophy 2022-23: టీమిండియా టెస్ట్‌ క్రికెటర్‌, ఆంధ్ర జట్టు కెప్టెన్‌ హనుమ విహారి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌-4 మ్యాచ్‌లో ఒంటిచేత్తో పోరాటం చేస్తున్న యోధుడిలా మారిపోయాడు. తొలి రోజు (జనవరి 31) ఆటలో ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో గాయపడి, మణికట్టు ఫ్రాక్చర్‌కు గురైన విహారి.. జట్టు కష్టాల్లో ఉండగా ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా, నొప్పిని భరిస్తూ, ఒంటిచేత్తో అది కూడా తన బ్యాటింగ్‌ శైలికి భిన్నంగా లెఫ్ట్‌ హ్యాండ్‌తో (రెండో రోజు) బ్యాటింగ్‌ చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద బ్యాటింగ్‌ చేసి 27 పరుగులు చేసిన విహారి తన జట్టుకు కొన్ని ఉపయోగకరమైన పరుగులు సమకూర్చి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆట మూడో రోజు కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్ర జట్టుకు మరోసారి విహారి అవసరం పడింది. ఆ జట్టు 76 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి బరిలోకి దిగిన విహారి.. ఈసారి కత్తి పట్టిన యోధుడిలా కనిపించాడు.

లెఫ్ట్‌ హ్యాండ్‌తో, అది కూడా సింగిల్‌ హ్యాండ్‌తో బ్యాటింగ్‌ చేస్తూ తన జట్టుకు ఎంతో ముఖ్యమైన 15 పరుగులు జోడించిన విహారి.. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొన్న ఆంధ్ర కెప్టెన్‌.. ఒంటి చేత్తో బ్యాట్‌ను కత్తిలా దూస్తూ 3 బౌండరీలు బాదడం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, విహారికి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా యోధుడిలా పోరాటం చేయడం కొత్తేమీ కాదు.

2021 ఆస్ట్రేలియా పర్యటనలో (సిడ్నీ టెస్ట్‌) టీమిండియా కష్టాల్లో ఉండగా.. ఆసీస్‌ బౌలర్లు బాడీని టార్గెట్‌ చేసి బౌలింగ్‌ చేస్తున్నప్పుడు దెబ్బలు భరిస్తూ ఇంచుమించూ ఇలాంటి పోరాటమే చేశాడు. తాజాగా తన జట్టును గెలిపించుకునేందుకు విహారి పడుతున్న తాపత్రయం చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. సాహో వీరుడా అంటూ కితాబునిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 379, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకే ఆలౌటైన మధ్యప్రదేశ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి.       
 

మరిన్ని వార్తలు