Ranji Trophy: దుమ్మురేపిన రియాన్‌ పరాగ్‌.. తన్మయ్‌ అజేయ సెంచరీ వృథా

30 Dec, 2022 12:50 IST|Sakshi
దుమ్మురేపిన రియాన్‌ పరాగ్‌.. తన్మయ్‌ అజేయ సెంచరీ

Ranji Trophy 2022-23 - Hyderabad vs Assam: రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో తొలి విజయం సాధించాలన్న హైదరాబాద్‌ ఆశలపై అస్సాం నీళ్లు చల్లింది. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 18 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్‌ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ అజేయ సెంచరీ వృథాగా పోయింది.

రాణించిన బౌలర్లు!
కాగా ఎలైట్‌ బీ గ్రూపులో ఉన్న హైదరాబాద్‌- అస్సాం జట్ల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మంగళవారం టెస్టు మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. రవితేజ(4/53), కార్తికేయ(3/43)కు తోడుగా అజయ్‌ దేవ్‌ గౌడ్‌, త్యాగరాజన్‌, భగత్‌ వర్మ ఒక్కో వికెట్‌తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో అస్సాంను 205 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్‌ రోహిత్‌ రాయుడు 60, తొమ్మిదో స్థానంలో వచ్చిన భగత్‌ వర్మ 46 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 208 పరుగుల వద్ద ముగించగలిగింది. 

తన్మయ్‌ ఒంటరి పోరాటం వృథా
ఇక రెండో ఇన్నింగ్స్‌లో అస్సాం 252 పరుగులకు ఆలౌట్‌ కాగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ 61 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. ఈ క్రమంలో విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచిన హైదరాబాద్‌.. శుక్రవారం కార్తికేయ అవుట్‌ కావడంతో ఓటమిని మూటగట్టుకుంది.

దీంతో జట్టును గెలిపించాలని తాపత్రయపడ్డ కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (158 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 126 పరుగులు- నాటౌట్‌) ఒంటరి పోరాటం వృథాగా పోయింది.  

అదరగొట్టిన రియాన్‌ పరాగ్‌
ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించిన అస్సాం ఆటగాడు రియాన్‌ పరాగ్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 88 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేయడం విశేషం.

అంతేకాదు రియాన్‌.. ఏకంగా 8 వికెట్లు కూల్చడం గమనార్హం. కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ లెగ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ అస్సాం గెలుపొందడంలో తన వంతు సాయం చేశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రియాన్‌ ఐపీఎల్‌ జట్టు రాజస్తాన్‌ రాయల్స్‌లో సభ్యుడన్న సంగతి తెలిసిందే. 

చదవండి: Rishabh Pant Health: ప్లాస్టిక్‌ సర్జరీ?! పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే..
Rishabh Pant: ఉదయమే పంత్‌ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా 
Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్‌.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్‌ అంటే కేవలం..

మరిన్ని వార్తలు