Afghanisthan: క్రికెటర్ల పరిస్థితి.. ఐపీఎల్‌లో ఆడతారా?

16 Aug, 2021 13:09 IST|Sakshi

గతంలో ఆఫ్ఘ‌నిస్థాన్‌ దేశం తాలిబ‌న్ల నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చ‌డంతోపాటు అక్క‌డి క్రికెట్ కూడా ఎంతో పురోగ‌తి సాధించింది. ఈ క్రమంలో ఆ దేశం నుంచి నుంచి ర‌షీద్ ఖాన్‌ లాంటి ఆటగాడు ప్రపంచ స్థాయి స్పిన్ బౌలర్ గా ఎదిగి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ దేశం మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో అక్క‌డి క్రికెట‌ర్ల భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంలో పడింది. స్టార్ క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీలాంటి ఆటగాళ్ళు వ‌చ్చే నెల‌లో జ‌రిగే ఐపీఎల్‌లో ఆడ‌తారా లేదా అనేది తాజాగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అనుమానంగా మారిందనే చెప్పాలి.

ప్ర‌స్తుతం  వీరిద్దరూ ఆఫ్ఘ‌నిస్థాన్‌లో లేరు. హండ్రెడ్ టోర్నీలో ఆడటం కోసం యూకేలో ఉన్నారు. ర‌షీద్ ట్రెంట్ రాకెట్స్‌కు, న‌బీ లండ‌న్ స్పిరిట్స్‌కు ఆడుతున్నారు. అయితే వీళ్లు అక్క‌డి నుంచి నేరుగా యూఏఈ వ‌చ్చి ఐపీఎల్‌లో పాల్గొంటారా లేదా అనేదానిపై ఇంకా ఏటువంటి స్ప‌ష్ట‌త లేదు. మరో పక్క వాళ్లు వ‌స్తార‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉన్న‌ద‌ని బీసీసీఐ చెబుతోంది. కాకపోతే ఇప్పుడే దీనిపై కచ్చితంగా ఏమి చెప్పలేము, తాజా ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నట్లు పేర్కొంది.

యుకే లో టోర్నీ ముగిశాక కూడా ర‌షీద్‌, న‌బీ అక్కడే వుంటే మ‌న వాళ్ల‌తో క‌లిపి ఒకే విమానంలో తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం బీసీసీఐ చేయాలని భావిస్తోంది. ర‌షీద్‌, న‌బీ ఇద్ద‌రూ ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితిపై అక్క‌డి క్రికెట్ బోర్డుతో బీసీసీఐ మాట్లాడుతామని తెలిపింది. ఇప్ప‌టికే త‌మ దేశాన్ని ర‌క్షించాలంటూ ర‌షీద్ ఖాన్ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

మరిన్ని వార్తలు