IPL 2021: వాళ్లిద్దరూ అందుబాటులో ఉంటారు: స‌న్‌రైజ‌ర్స్‌

16 Aug, 2021 17:13 IST|Sakshi

హైద‌రాబాద్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ దేశ క్రికెట‌ర్లు ఐపీఎల్‌ సెకెండ్‌ లెగ్‌కు అందుబాటులో ఉంటారో లేదో అన్న సందిగ్ధత నెల‌కొంది. అయితే యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభంకానున్న లీగ్‌లో త‌మ జట్టుకు ఆడాల్సిన ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మద్ న‌బీలు అందుబాటులో ఉంటార‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సోమ‌వారం ప్రక‌టించింది. ఓ ప్రముఖ న్యూస్‌ ఏజన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ సీఈవో ష‌ణ్ముగం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జ‌రుగుతుందన్న దానిపై మేము మాట్లాడ‌దలుచుకోలేదు. అయితే, తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆ దేశ క్రికెటర్లు మాత్రం లీగ్‌కు అందుబాటులో ఉంటారని చెప్పగలనని పేర్కొన్నారు. ఈ నెల 31న ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు యూఏఈకి బ‌య‌లుదేరబోతుంద‌ని ష‌ణ్ముగం వెల్లడించారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ర‌షీద్ ఖాన్‌, న‌బీ ఇద్దరూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో నెల‌కొన్న పరిస్థితుల నేపథ్యంలో త‌న కుటుంబాన్ని అక్కడి నుంచి ఎలా బ‌య‌ట‌కు తీసుకురావాలన్న దానిపై ర‌షీద్ ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్సన్ పేర్కొన్నాడు. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసేయ‌డంతో అక్కడి నుంచి వివిధ దేశాల‌కు విమాన రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల కిందే తమ దేశాన్ని అనిశ్చితి నుంచి బయటపడేయాలని రషీద్‌ ఖాన్‌ ప్రపంచ దేశాల నేతలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 
చదవండి: అవును.. లార్డ్స్ ఆండ‌ర్సన్ అడ్డానే.. కోహ్లికి కౌంటరిచ్చిన బ్రాడ్‌

మరిన్ని వార్తలు