Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు.. టి20 కెప్టెన్‌గా

29 Dec, 2022 18:58 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌ టి20 క్రికెట్‌ కొత్త కెప్టెన్‌గా జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ ఎంపికయ్యాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో ఆఫ్గన్‌ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మహ్మద్‌ నబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి బోర్డు కొత్త టి20 కెప్టెన్‌ను ఎన్నుకోలేదు. తాజాగా బోర్డు మరోసారి రషీద్‌ ఖాన్‌వైపే చూసింది. గతంలో వద్దనుకున్న ఆటగాడే మళ్లీ దిక్కయ్యాడు.

ఇక టి20 కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ ఎంపికవ్వడం ఇది రెండోసారి. గతంలో 2021 టి20 ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసిన రెండు రోజులకే రషీద్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కేవలం రెండు నెలల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాడు. కొన్ని విషయాల్లో బోర్డుతో తలెత్తిన సమస్యల కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రషీద్‌ ఆ సమయంలో వివరించాడు. 

దీంతో మహ్మద్‌ నబీని బోర్డు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అలా రెండేళ్ల పాటు మహ్మద్‌ నబీ జట్టును నడిపించాడు. అతని కెప్టెన్సీలో అఫ్గానిస్తాన్‌ జట్టు మంచి విజయాలను నమోదు చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో మాత్రం నిరాశజనక ప్రదర్శనను కనబరిచింది. రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దు కాగా.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓడి సూపర్‌-12 దశలోనే వెనుదిరిగింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ నబీ మరుసటి రోజే కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

నూతన టి20 కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై రషీద్‌ ఖాన్‌ తన ట్విటర్‌లో స్పందించాడు. ''నన్ను అభిమానించిన శ్రేయోభిలాషులకు.. అండగా నిలబడిన కుటుంబసభ్యలుకు, మిత్రులకు కృతజ్ఞతలు.  టి20 కెప్టెన్‌గా తిరిగి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. కెప్టెన్‌ పాత్రతో నా పాత్ర మరింత పెరిగింది. కెప్టెన్సీ అనేది ఎంతో చాలెంజ్‌తో కూడుకున్నది. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా.''  అంటూ ట్వీట్‌ చేశాడు.

తాజాగా రషీద్‌ ఖాన్‌ను మరోసారి టి20 కెప్టెన్‌గా ఎంపిక చేసిన బోర్డు స్పందించింది. ''అఫ్గానిస్తాన్‌ను మూడు ఫార్మాట్లలో సమర్థంగా నడిపించగల సత్తా రషీద్‌ ఖాన్‌కు ఉంది. టి20 కెప్టెన్‌గా మరోసారి బాధ్యతలు తీసుకుంటున్న రషీద్‌కు ఇవే మా కృతజ్ఞతలు. కెప్టెన్‌గా తాను ఉన్నత స్థానాన్ని అందుకుంటాడని.. జట్టును గౌరవ స్థానంలో నిలుపుతాడని ఆశిస్తున్నాం'' అంటూ అఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వయిస్‌ అష్రఫ్‌ పేర్కొన్నాడు. ఇక రషీద్‌ ఖాన్‌ అఫ్గానిస్తాన్‌ తరపున ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్‌ల్లో 122 వికెట్లు, 86 వన్డేల్లో 163 వికెట్లు, ఐదు టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: కేన్‌ మామ డబుల్‌ సెంచరీ.. కివీస్‌ తరపున తొలి బ్యాటర్‌గా

టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులో సూర్య

మరిన్ని వార్తలు