ఐపీఎల్‌ 2023 ప్రారంభ వేడుకల్లో పాన్‌ ఇండియా బ్యూటీలు

23 Mar, 2023 15:00 IST|Sakshi

మరో 8 రోజుల్లో (మార్చి 31) క్రికెట్‌ పండుగ ఐపీఎల్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మత్తెక్కిచే ఓ వార్త తెలిసింది. ఐపీఎల్‌ 2023 ఎడిషన్‌ ప్రారంభ వేడుకల్లో పాన్‌ ఇండియా బ్యూటీలు రష్మిక మంధన, తమన్నా భాటియా లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ చేయనున్నారని సమాచారం. కోవిడ్‌ కారణంగా గత మూడేళ్లుగా ప్రారంభ వేడుకలు జరగని కారణంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది.

ఇందులో భాగంగానే సినీ గ్లామర్‌ను వాడుకోవాలని భారీ ప్రణాళికను రచించింది. రష్మిక, తమన్నా లతో పాటు మరికొంత మంది మేల్‌, ఫిమేల్‌ పాన్‌ ఇండియా ఆర్టిస్ట్‌లు ఈ వేడుకల్లో పాల్గొంటారని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు వెల్లడించారు. మూడేళ్ల తర్వాత హోమ్ అండ్‌ అవే  ఫార్మాట్ తిరిగి అమల్లోకి వస్తున్నందున, ప్రేక్షకులను వేడుకతో మైదానాలకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు.  

కాగా, ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ ప్రారంభ వేడుకలు మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు అరంగంట ముందు (సాయంత్రం 7:30 గంటలకు) ఓపెనింగ్‌ సెర్మనీ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్‌ చేస్తోంది.  

ఇదిలా ఉంటే, బీసీసీఐ.. మహిళల ఐపీఎల్‌ (WPL)కు ముందు కూడా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించింది. అయితే, సినీ గ్లామర్‌ లేకపోవడంతో ఆ వేడుక ఫ్లాప్‌ అయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ భారీ తారాగణంతో ఐపీఎల్‌-2023 ప్రారంభ వేడుకను నిర్వహించాలని డిసైడైంది. 

మరిన్ని వార్తలు