Ravi Ashwin- Yash Dhull: క్లాసిక్‌ సెంచరీ.. మరో ఉన్ముక్త్‌ చంద్‌ కాకుంటే చాలు.. అశ్విన్‌ అదిరిపోయే రిప్లై!

3 Feb, 2022 15:44 IST|Sakshi

టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికపుడు తన అప్‌డేట్లు పంచుకునే అశూ.. యూట్యూబ్‌ చానెల్‌లో క్రికెట్‌కు సంబంధించి తన అభిప్రాయాలు పంచుకుంటాడు. ఇటీవల పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అశ్విన్‌ తనదైన శైలిలో బ్యాట్‌ చేతబట్టి స్టెప్పులేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్‌ మనసు గెలుచుకున్నాడు. అండర్‌-19 భారత జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌కు అండగా నిలిచాడు.

ఐసీసీ అండర్‌ 19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ ఫైనల్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. యశ్‌ ధుల్‌ సారథ్యంలోని జట్టు  సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతోనే కాదు... బ్యాటర్‌గానూ 110 పరుగులతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు యశ్‌. ఈ క్రమంలో అతడిపై అశ్విన్‌ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా... ‘‘కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అద్భుత ప్రయాణానికి ఇది నాంది అని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు.

ఇందుకు స్పందించిన ఓ నెటిజన్‌... ‘‘ఏదేమైనా యశ్‌... మరో ఉన్ముక్త్‌ చంద్‌లా అయిపోకూడదు’’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇందుకు అశూ కౌంటర్‌ వేశాడు. ‘‘కాస్త ఆశావాదాన్ని ప్రోత్సహించండయ్యా’’ అని సదరు నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. కాగా 2012లో ఉన్ముక్త్‌ చంద్‌ సారథ్యంలో భారత జట్టు అండర్‌–19 ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ జట్టు తరఫున ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు.

ఈ క్రమంలో రిటైర్మెంట్‌ ప్రకటించిన ఉన్ముక్త్‌ అమెరికాకు వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుని.. ‘బిగ్‌బాష్‌’ మ్యాచ్‌ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఉన్ముక్త్‌  మాదిరే.. యశ్‌ ధుల్‌ కాకూడదంటూ నెటిజన్‌ పేర్కొనగా.. అశూ అందుకు తనదైన శైలిలో బదులిచ్చాడు. 

చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అత‌డికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్య‌ర్‌కి మ‌రీ ఇంత త‌క్కువా!

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు