Ravindra Jadeja: కోహ్లి, అశ్విన్‌లతో సమానమయ్యాడు.. నెక్స్ట్‌ టార్గెట్‌ అనిల్‌ కుంబ్లే

20 Feb, 2023 16:51 IST|Sakshi

BGT 2023 IND VS AUS 2n Test: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న​ విషయం విధితమే. గాయం కారణంగా (ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు) గత ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న జడ్డూ భాయ్‌.. వచ్చీ రాగానే టెస్ట్‌ల్లో తన మార్కు హవాను కొనసాగిస్తున్నాడు.

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 7 వికెట్లతో (5/47, 70, 2/34) పాటు కీలకమైన హాఫ్‌సెంచరీ చేసిన జడ్డూ.. న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో బంతితో భీకర స్థాయిలో విజృంభించి ఏకంగా 10 వికెట్లు (3/68, 26, 7/42) పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్‌తో పర్వాలేదనిపించిన జడేజా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన 26 పరుగులు స్కోర్‌ చేశాడు.

10 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టి, ఆసీస్‌ వెన్నులో వణుకు పుట్టించినందుకు గాను జడేజాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డును జడేజా తన 62 టెస్ట్‌ మ్యాచ్‌ల కెరీర్‌లో తొమ్మిదోసారి అందుకున్నాడు. ఈ అవార్డు అందుకునే క్రమంలో జడ్డూ.. సహచర స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, విరాట్‌ కోహ్లిల రికార్డును సమం చేశాడు. కోహ్లి తన 106 టెస్ట్‌ మ్యాచ్‌ల కెరీర్‌లో 9 సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకోగా.. అశ్విన్‌ 90 టెస్ట్‌ల కెరీర్‌లో ఇన్నే సార్లు ఈ అవార్డును దక్కించుకున్నాడు.

జడ్డూ మరోసారి టెస్ట్‌ల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకుంటే, దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే రికార్డును సమం చేస్తాడు. భారత తరఫున అత్యధిక సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలిచిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, జడేజా, అశ్విన్‌, కోహ్లి వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు.

కెరీర్‌లో 200 టెస్ట్‌లు ఆడిన సచిన్‌ 14 సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకోగా.. 163 టెస్ట్‌లు ఆడిన ద్రవిడ్‌ 11 సార్లు, 132 మ్యాచ్‌లు ఆడిన కుంబ్లే 10 సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో ఇంకా రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున జడేజా ఈ సిరీస్‌లోనే ద్రవిడ్‌ రికార్డును కూడా సమం చేసే అవకాశం ఉంది. ఇండోర్‌లో మార్చి 1-5 వరకు మూడో టెస్ట్‌, అహ్మదాబాద్‌లో మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. అనంతరం టీమిండియా ఆసీప్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడుతుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, వైజాగ్‌, చెన్నైల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. 
 

మరిన్ని వార్తలు