Tokyo Olympics: ఫైనల్లో ఓడినా.. చరిత్ర లిఖించాడు

5 Aug, 2021 16:48 IST|Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. 57 కిలోల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌తో జరిగిన  హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్‌ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్నాడు. తద్వారా సుశీల్‌ కుమార్‌ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన ఐదో రెజ్లర్‌గా రవి కుమార్‌ నిలిచాడు. కేడీ జాదవ్‌(కాంస్యం), సుశీల్‌ కుమార్‌(కాంస్యం, రజతం), సాక్షి మాలిక్‌( కాంస్యం), యేగేశ్వర్‌ దత్‌( కాంస్యం) తర్వాత రవి దహియా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు.

గ‌తంలో 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్ రెజ్లింగ్‌లో సిల్వ‌ర్ సాధించిన విష‌యం తెలిసిందే. టక్యో ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు రవికుమార్‌ దహియాపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ రవికుమార్‌ బుధవారం జరిగిన అర్హత, క్వార్టర్స్‌, సెమీస్‌ బౌట్లలో దుమ్మురేపాడు. దాదాపు అన్ని ఏకపక్ష విజయాలు సాధించిన రవికుమార్‌ సెమీస్‌లో కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్‌ సనయేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందు వెనుకబడినా చివరి నిమిషంలో అద్బుతంగా నిలదొక్కుకొని విక్టరీ బై ఫాల్‌ కింద గెలపొంది ఫైనల్‌కు ప్రవేశించాడు.

మరిన్ని వార్తలు