Ravi Shastri: వన్డే క్రికెట్‌ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..!

26 Jul, 2022 15:34 IST|Sakshi

పొట్టి క్రికెట్‌ ప్రభావం కారణంగా నానాటికీ శోభ తగ్గిపోతున్న వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. వన్డేలు అంతరించిపోకుండా మనుగడ సాగించాలంటే ఓ కీలక మార్పు చేయాలని సూచించాడు. వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఆసన్నమైందని, లేకపోతే వన్డే క్రికెట్‌ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు.

ఓవర్లను కుదించడం వల్ల వన్డేలకు మునపటి కంటే అధికమైన ఆదరణ లభిస్తుందని తెలిపాడు. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్‌ను 50 ఓవర్లకు కుదించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇటీవలి కాలంలో చాలామంది క్రికెటర్ల వన్డేలకు గుడ్‌బై చెబుతున్నందున ఈ మార్పుపై ఐసీసీ దృష్టి సారించాలని కోరాడు. 50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల ప్రేక్షకులు బోర్‌ ఫీలవుతుంటే, ఆటగాళ్లు తీవ్ర అలసటకు లోనై ఒత్తిడికి గురవుతున్నారని అన్నాడు.

ఈ విషయంలో ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్‌ చచ్చిపోతుందని తెలిపాడు. ఇదే విషయాన్ని పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కూడా ప్రతిపాదించాడు.  మరోవైపు వసీమ్‌ అక్రమ్‌ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్‌  అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌లో నుంచి వన్డే ఫార్మాట్‌ను తొలగించాలని వాదిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
చదవండి: 'అతడు డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు.. టీ20 ప్రపంచకప్‌, ఆసియా కప్‌కు ఎంపిక చేయండి'
 

మరిన్ని వార్తలు