IPL 2022: టీమిండియా కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

22 Mar, 2022 21:34 IST|Sakshi

టీమిండియాకు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో రోహిత్‌ శర్మ రెగ్యులర్‌ కెప్టెన్‌ అయిన సంగతి తెలిసిందే. అతని నాయకత్వంలో టీమిండియా స్వదేశంలో వరుసగా సిరీస్‌లు గెలిచింది. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మహా అయితే రెండు, మూడేళ్లు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆ తర్వాతైనా టీమిండియాకు కొత్త కెప్టెన్‌ అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. 

రానున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఎడిషన్‌లో చాలా మంది ఆటగాళ్లు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా పనిచేసేందుకు తమను తాము నిరూపించుకునేందుకు చక్కని అవకాశం. ఇప్పటికే కోహ్లి కెప్టెన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం రోహిత్‌ టీమిండియాకు ఉత్తమ కెప్టెన్‌ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అ‍య్యర్‌, రిషబ్‌ పంత్‌లు భవిష్యత్తు టీమిండియా కెప్టెన్లుగా కనబడుతున్నారు. ఒక రకంగా ఈ ఐపీఎల్‌ సీజన్‌ అందుకు పునాది అవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నా.

ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లో ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తోంది. గత సీజన్‌ ద్వారా వెంకటేశ్‌ అయ్యర్‌ గురించి తెలిసింది. అప్పుడు అతని గురించి ఎవరు మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నాడు. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా.. అదే ఐపీఎల్‌కు ఉన్న బ్యూటీ..'' అంటూ స్టార్స్‌స్పోర్ట్స్‌ నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలపై అభిమానులు స్పందించారు. ''ఇ‍ప్పటికైతే రోహిత్‌ ఉన్నాడుగా.. ఈ సమయంలో ఇది అవసరమా''.. అంటూ కామెంట్‌ చేశారు. 

టీమిండియాకు కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కామెంటేటర్‌ అవతారం ఎత్తనున్నాడు. రవిశాస్త్రితో పాటు రైనా కూడా కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. ఇక మార్చి 26న సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 15వ సీజన్‌కు తెరలేవనుంది.

>
మరిన్ని వార్తలు