ధావన్‌కు అన్యాయం జరుగుతూనే ఉంది: రవిశాస్త్రి

25 Nov, 2022 22:03 IST|Sakshi

టీమిండియా గబ్బర్‌గా పేరు పొందిన శిఖర్‌ ధావన్‌ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో కీలక బ్యాటర్‌గా రాణించిన ధావన్‌ను కేవలం వన్డేలకే మాత్రమే పరిమితం చేసింది బీసీసీఐ. అయితే ధావన్‌ మాత్రం అందుకు ఏం బాధపడకుండా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే వచ్చాడు. ఇక 2023 వన్డే వరల్డ్‌కప్‌ దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ధావన్‌కు ఎక్కువగా వన్డేల్లోనే అవకాశాలు ఇస్తూ వస్తోంది. దీనికి తోడు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో ధావన్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా తనదైన శైలిలో రాణిస్తూ వరల్డ్‌కప్‌కు సన్నద్ధమవుతున్నాడు. 

తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైనప్పటికి ధావన్‌ మాత్రం బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 77 బంతుల్లో 72 పరుగులు చేసి తన ఫామ్‌ను చూపెట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి మాత్రం శిఖర్‌ ధావన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధావ‌న్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేద‌ని పేర్కొన్నాడు.

అమెజాన్ ప్రైమ్‌ వీడియోతో ర‌విశాస్త్రి మాట్లాడుతూ.. ''ధావ‌న్‌కు రావాల్సినంత పేరు రాలేదు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ మీద‌నే అంద‌రి దృష్టి ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. ధావ‌న్‌కు వ‌న్డేల్లో అద్భుత‌మైన‌ రికార్డు ఉంది. టాలెంట్ ఉన్న యువ ఆట‌గాళ్లు చాలామంది ఉన్నప్పటికీ ధావ‌న్‌కు వ‌న్డేల్లో ఉన్న అనుభ‌వం చాలా విలువైన‌ది. అత‌ను యంగ్‌స్టర్స్‌ను గైడ్ చేయ‌గ‌ల‌డు. రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో ధావన్‌ది కచ్చితంగా కీలకపాత్ర ఉంటుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. మొద‌టి వ‌న్డేలో శిఖ‌ర్ ధావ‌న్ 77 బంతుల్లో 72 ర‌న్స్ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి వ‌న్డేలో న్యూజిలాండ్‌ టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్లలో ఏడు వికెట్ల నష్టానికి 306 ప‌రుగులు చేసింది. ధావ‌న్‌తో పాటు ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (50), శ్రేయ‌ర్ అయ్యర్‌ (80) హాఫ్ సెంచ‌రీలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. టామ్ లాథ‌మ్ (148) సెంచ‌రీతో చెల‌రేగగా.. అత‌నికి కెప్టెన్ విలియ‌మ్సన్‌ (94 పరుగులు) అండ‌గా నిలబడ్డాడు.

మరిన్ని వార్తలు