క్వారంటైన్‌ కలిపింది ఆ ఇద్దరినీ...

31 Mar, 2021 00:52 IST|Sakshi

కోహ్లి, రోహిత్‌ శర్మ మధ్య విభేదాలు వాస్తవమే

రవిశాస్త్రి జోక్యంతో పరిష్కారం

ముంబై: గత రెండేళ్లుగా ఇద్దరు భారత టాప్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ మధ్య విభేదాలు ఉన్నట్లు పలుమార్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సోషల్‌ మీడియాలో కూడా అభిమానుల మధ్య చాలాసార్లు రచ్చ జరిగింది. అయితే ఈ విషయాన్ని వీరిద్దరు అంగీకరించడం కానీ ఖండించడం గానీ ఎప్పుడూ చేయలేదు. మైదానంలో, జట్టు కోసం ఆడుతున్న సమయంలో కూడా అలాంటిది ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. వ్యక్తిగత అంశాల గురించి ఆలోచనే రాకుండా టీమ్‌ గెలుపు కోసం పరస్పర గౌరవంతోనే ఆడుతూ వచ్చారు. అయితే ‘విభేదాలు’ వాస్తవమేనని తేలింది. పైగా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి జోక్యం చేసుకొని దీనిని చక్కబెట్టినట్లు కూడా తెలిసింది. ముఖ్యంగా కరోనా కాలంలో క్వారంటైన్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో కోహ్లి, రోహిత్‌ శర్మ పరస్పరం పలు అంశాలపై మాట్లాడుకునేందుకు తగినంత తీరిక దొరిగింది.

తమ మధ్య పెరుగుతున్న అంతరానికి  కారణమైన వేర్వేరు విషయాలపై వీరిద్దరు చర్చించుకున్నారని... ఈ విషయంలో రవిశాస్త్రిదే కీలకపాత్ర అని సమాచారం. ‘రెండు పెద్ద సిరీస్‌లలో విజయం సాధించడంతోపాటు టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌కు సంబంధించి మరో మేలు జరిగింది. కొన్ని వారాలుగా కోహ్లి, రోహిత్‌ మధ్య వ్యక్తిగత బంధం దృఢంగా మారింది. జట్టు గురించి, తమ బాధ్యతలు, రాబోయే సవాళ్ల గురించి వారు బాగా చర్చించుకున్నారు. తామిద్దరం పరస్పరం సమన్వయంతో కలిసి పని చేస్తే జట్టుకు ఎలాంటి మంచి జరుగుతుందో వారికి అర్థమైంది. గత నాలుగు నెలల్లో జట్టుకు దీనివల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. తామిద్దరి గురించి బయట ప్రచారం ఉన్న పలు విషయాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి.  చదవండి: (ఐపీఎల్‌ 2021: పంజాబ్‌ పదునెంత?)

జట్టులో నేను ఎవరికంటే తక్కువ కాదు అనే భావనతో ఇద్దరూ ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉంటే మిగతావారు దానిని దుర్వినియోగం చేయడం ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్‌లో ఉన్నదే. ఒకేచోట పని చేసే ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు ఏ రంగంలోనైనా ఉంటాయి. అవి అభిప్రాయభేదాలు మాత్రమే. అయితే ఇంతకాలం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని వారు అనుకోలేదు. ఇప్పుడు ఇద్దరికీ చాలా స్పష్టత వచ్చింది. ఇటీవల జరిగిన మ్యాచ్‌లు చూస్తే వీరి మధ్య బంధం బలపడినట్లు మనందరికీ అర్థమవుతుంది. బయో బబుల్‌ చేసిన మేలు ఇది’ అని బీసీసీఐలోని కీలక వ్యక్తి ఒకరు ఈ పరిణామాలను వెల్లడించారు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు