కోహ్లిని చూసినట్టే అనిపించింది: రవిశాస్త్రి

30 Dec, 2020 09:46 IST|Sakshi

మా కుర్రాళ్ల పట్టుదల అద్భుతం

మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా ప్రదర్శన పట్ల ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. భారీ ఓటమి తర్వాత ఇంత గొప్పగా పునరాగమనం చాటడం ప్రశంసనీయమన్నాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రహానే సారథ్యంలోని టీమిండియా ఆతిథ్య జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది, పింక్‌బాల్‌ టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘36 పరుగులకు ఆలౌటైన తర్వాత కోలుకొని ప్రత్యర్థిపై పంచ్‌ విసిరేందుకు సిద్ధం కావడం అసాధారణం. నా దృష్టిలో భారత క్రికెట్‌లో... కాదు కాదు ప్రపంచ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఘనమైన పునరాగమనంగా ఇది నిలిచిపోతుంది. మ్యాచ్‌లో మా కుర్రాళ్లు చూపించిన పట్టుదల అద్భుతం.

ముఖ్యంగా అడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత ఆటగాళ్లకు నేను ఏమీ చెప్పలేదు. అలాంటి వైఫల్యం తర్వాత చేసేదేమీ ఉండదు. అయితే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించాలంటే మ్యాచ్‌లో కొద్దిసేపు మాత్రమే కాకుండా ఐదు రోజులూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే. మంగళవారం క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయాలని, అవసరమైతే 150 పరుగుల వరకు కూడా ఛేదించాల్సి వస్తే సిద్ధంగా ఉండాలని మాట్లాడుకున్నాం. కీలక దశలో కెప్టెన్సీ భారం మోస్తూ కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఆరు గంటల పాటు మైదానంలో ఉండి సెంచరీ చేసిన రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు. కోహ్లి, రహానే ఇద్దరూ గేమ్‌ను చక్కగా అర్థం చేసుకుంటారు. తనకేం కావాలో రహానేకు బాగా తెలుసు. తొందరపాటుకు తావివ్వకుండా కుదురుగా తన పని తాను చేశాడు. కోహ్లిని చూసినట్టే అనిపించింది’’ అని కితాబిచ్చాడు.(చదవండి: విజయ మధురం)

టీమిండియా బాగా ఆడింది: టిమ్‌ పైన్‌
చాలా నిరాశగా ఉంది. మేం ఎంతో పేలవంగా ఆడాం. భారత్‌ చాలా బాగా ఆడింది. చక్కటి బౌలింగ్‌తో మేం తప్పులు చేసేలా పురిగొల్పింది. పరిస్థితులకు తగినట్లుగా మా ఆటను మార్చుకోలేకపోయాం. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం. మా ఆటను మెరుగుపర్చుకొని తర్వాతి రెండు టెస్టులకు సిద్ధమవుతాం.
–టిమ్‌ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్‌   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు