Ravi Shastri: "అతడు యార్కర్ల కింగ్‌.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం"

5 Apr, 2022 16:44 IST|Sakshi

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ టి. నటరాజన్‌పై భారత మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నటరాజన్‌ అద్భుతంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్‌-2021లో నటరాజన్‌ సేవలను భారత్‌ కచ్చితంగా కోల్పోయింది అని రవిశాస్త్రి తెలిపాడు. గత ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నటరాజన్‌ మోకాలికి గాయమైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌కు నటరాజన్‌ దూరమయ్యాడు. అయితే అతడు ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.

"టీ20 ప్రపంచకప్‌లో నటరాజన్‌ సేవలను కోల్పోయాం. అతడు ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా జట్టులో ఉండేవాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో నటరాజన్‌ గాయపడ్డాడు. అతడు స్పెషలిస్ట్ డెత్ బౌలర్, యార్కర్లను అద్భుతంగా వేయగలడు. అతడు తన పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్ప తిప్పలు పెడతాడు. నేను అతడిని ఎంపిక చేసిన ప్రతి మ్యాచ్‌లోను భారత్‌ విజయం సాధించింది. అతడి అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోను భారత్‌ విజయం సాధించింది. అదే విధంగా అతడి టెస్టు అరంగేట్రంలోను టీమిండియా గెలిపొం‍దింది. నటరాజన్‌ నెట్ బౌలర్ నుంచి ఈ స్థాయికి ఎదగడం నిజంగా గర్వించ దగ్గ విషయం" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే!

మరిన్ని వార్తలు