Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్‌ కప్‌ కొట్టబోతుంది..'

21 May, 2022 08:29 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ లీగ్‌ దశను రెండో స్థానంతో ముగించింది. శుక్రవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 151 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. మొదట ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ అర్థ సెంచరీతో మెరిసినప్పటికి.. చివర్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ (23 బంతుల్లో 40 నాటౌట్‌, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స​ ఆడి జట్టును ప్లేఆఫ్‌ చేర్చడంతో పాటు రెండో స్థానంలో నిలిపాడు. అంతకముందు బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఓవరాల్‌గా తనలోని ఆల్‌రౌండర్‌ను మరోసారి బయటపెట్టిన అశ్విన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మ్యాచ్‌ విజయం అనంతరం అశ్విన్‌ తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.''కీలక సమయంలో అర్థసెంచరీతో మెరవడం సంతోషంగా అనిపించింది. ఒత్తిడిలో ఆడడం నాకు ఎప్పుడు ఇష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయమే కదా మనలో ఉన్న ప్రతిభను భయటపెట్టేది. జైశ్వాల్‌ మంచి పునాది వేయగా... దానిని నేను కంటిన్యూ చేశాను. ప్లేఆఫ్‌లోనూ ఇదే ప్రదర్శన చేసి ఫైనల్‌ చేరుకుంటాం. రాసిపెట్టుకోండి.. ఈసారి కచ్చితంగా రాజస్తాన్‌ కప్‌ కొట్టబోతుంది'' అని పేర్కొన్నాడు. అశ్విన్‌ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి 183 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు.

అశ్విన్‌ కామెంట్స్‌ విన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో స్పందించారు. రాజస్తాన్‌ రాయల్స్‌కు కప్‌ అందించాలని అశ్విన్‌ కంకణం కట్టుకున్నాడు.. రాజస్తాన్‌కు కప్‌ అందించే వరకు వదలడంట.. ఒక్క ఇన్నింగ్స్‌తో మొయిన్‌ అలీని పక్కకు నెట్టేశాడు.. తన పాత జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్‌తో మెరుస్తాడని ఎవరు ఊహించి ఉండరు. అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక ఈ సీజన్‌ను రెండో స్థానంతో ముగించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. ఒకవేళ మ్యాచ్‌లో ఓడినప్పటికి రాజస్తాన్‌కు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2లో తలపడుతాయి. కాగా రాజస్తాన్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ను మే 24(మంగళవారం) ఆడనుంది.

Poll
Loading...
మరిన్ని వార్తలు