ICC Test Rankings: నంబర్‌ 1 బౌలర్‌గా అశ్విన్‌.. ఒక స్థానం ఎగబాకిన బుమ్రా

1 Mar, 2023 15:46 IST|Sakshi

ICC Test Bowling Rankings- Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. 

స్వదేశంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అశూ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన ఈ వెటరన్‌ స్పిన్నర్‌.. ఢిల్లీ టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు. 


అశ్విన్‌

రెండో టెస్టులో మూడే!
తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, అలెక్స్‌ క్యారీ వంటి కీలక బ్యాటర్ల వికెట్లు కూల్చి ఆసీస్‌ను దెబ్బ కొట్టిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో కలిసి ఆసీస్‌ నడ్డి విరిచాడు. 

మరోవైపు న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి టెస్టులో రాణించిన ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ రెండో టెస్టులో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి నంబర్‌ 1 ర్యాంకుకు చేరుకున్న ఆండర్సన్‌.. రెండో టెస్టులో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.


అశ్విన్‌- జేమ్స్‌ ఆండర్సన్‌

టాప్‌-5లో మనోళ్లు ఇద్దరు
ఈ నేపథ్యంలో జేమ్స్‌ ఆండర్సన్‌ ఎనిమిది రేటింగ్‌ పాయింట్లు కోల్పయి రెండో స్థానానికి పడిపోగా.. 864 పాయింట్లతో ఉన్న అశ్విన్‌ నంబర్‌ 1గా అవతరించాడు. టాప్‌-5లో ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌, టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, పాకిస్తాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది స్థానం సంపాదించారు.

ఇంగ్లండ్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ రెండు ర్యాంకులే దిగజారడంతో బుమ్రా నాలుగోస్థానానికి చేరుకోగా.. ఆఫ్రిది టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. కాగా 2015లో అశ్విన్‌ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ బుమ్రా టాప్‌-5లో కొనసాగడం విశేషం. 

ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. రవిచంద్రన్‌ అశ్విన్‌- ఇండియా- 864 పాయింట్లు
2. జేమ్స్‌ ఆండర్సన్‌- ఇంగ్లండ్‌- 859 పాయింట్లు
3. ప్యాట్‌ కమిన్స్‌- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు
4. జస్‌ప్రీత్‌ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు
5. షాహిన్‌ ఆఫ్రిది- పాకిస్తాన్‌- 787 పాయింట్లు

చదవండి: BGT 2023 IND VS AUS 3rd Test: జడ్డూ బౌలింగ్‌లో లబూషేన్‌ క్లీన్‌ బౌల్డ్‌.. తొలిసారి తప్పించుకున్నాడు, రెండోసారి..!
IND Vs AUS: ఏం జరుగుతోంది.. రోహిత్‌ శర్మ తప్పు చేశాడా?

మరిన్ని వార్తలు