ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో..

20 Feb, 2021 20:25 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో  కలిపి అశ్విన్ ‌17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు 5 వికెట్ల మార్క్‌ని అశ్విన్ అందుకోగా.. ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు డే నైట్ తరహాలో ప్రారంభంకానుంది. ఈ మూడో టెస్టులో అశ్విన్ 6 వికెట్లు పడగొడితే.. 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డులెక్కనున్నాడు.

2011లో భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకూ 76 టెస్టు మ్యాచ్‌లాడి 394 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 10 సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న అశ్విన్.. ఏకంగా 29 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. టీమిండియా తరపున దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టెస్టుల్లో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434 వికెట్లు), హర్భజన్ సింగ్ (417) టాప్-3లో కొనసాగుతున్నారు. ఒకవేళ అశ్విన్ 400 వికెట్ల మార్క్‌ని అందుకోగలిగితే.. ఈ ఘనత సాధించిన మూడో భారత స్పిన్నర్‌గా నిలవనున్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 800 వికెట్లతో ఉన్నాడు.
చదవండి: 'మాస్టర్‌' డ్యాన్స్‌తో దుమ్మురేపిన క్రికెటర్లు
సిక్సర్లతో రెచ్చిపోయిన ఇషాన్‌ కిషన్‌

మరిన్ని వార్తలు