Shane Warne: 'వార్న్ భుజాలు బలమైనవి'... రహస్యం తెలుసన్న అశ్విన్‌

9 Mar, 2022 14:15 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల వార్న్‌ మార్చి 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అచేతన స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. వార్న్‌ మరణంపై క్రీడాలోకం తమ అశ్రు నివాళి అర్పిస్తోంది. వార్న్‌ది సహజ మరణమేనని తేల్చిన పోలీసులు.. భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వార్న్‌ అంత్యక్రియలను అధికార లాంచనాలతో జరుపుతామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా వార్న్‌ మృతిపై టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నివాళి అర్పించాడు. దిగ్గజ స్పిన్నర్‌గా క్రికెట్‌ను ఏలిన వార్న్‌ సేవలు మరువలేనివని.. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి ప్రకటించాడు. ఈ సందర్భంగా వార్న్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సాధారణంగా వార్న్‌ భుజాలు చాలా బలంగా ఉండేవని.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తనకు తెలిసిందని అశ్విన్‌ పేర్కొన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో వార్న్‌ గురించి కొన్ని విషయాలు తెలిశాయని తెలిపాడు.

తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అశ్విన్‌ మాట్లాడుతూ.. '' కోచ్‌ ద్రవిడ్‌తో సంభాషణ సందర్భంగా వార్న్‌ మృతి ప్రస్తావన మా మధ్య వచ్చింది. దిగ్గజ స్పిన్నర్‌గా ఆయన సేవలు మరువలేనివి. ఒక స్పిన్నర్‌కు భుజాలతో పాటు శరీరంలో నడుము పై భాగం బలంగా ఉండాలి.. ఎందుకంటే వివిధ రొటేషన్లు ఉపయోగిస్తూ స్పిన్‌ బౌలింగ్‌ చేయాలి. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక లెగ్‌ స్పిన్నర్‌ బౌలర్‌కు భుజాలు మరింత బలంగా ఉండాలి.. అప్పుడే ఆ బౌలర్‌కు అది అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఈ విషయంలో వార్న్‌ అదృష్టవంతుడు. అతని భుజాలు చాలా బలమైనవి. ఈ విషయం నాకు రాహుల్‌ ద్రవిడ్‌ వల్ల తెలిసింది. వార్న్‌ బలమైన భుజాల వెనుక ఒక చిన్న కథ ఉంది.

వార్న్‌ పిల్లాడిగా ఉన్నప్పుడు.. ఒక సందర్భంలో తన రెండు కాళ్లు గాయానికి గురయ్యాయి. తన స్నేహితుడు ఆడుకుంటూ కాస్త ఎత్తు నుంచి వార్న్‌ కాళ్ల మీదకు దూకాడంట. దీంతో అతని రెండు కాళ్లు కాస్త దెబ్బతిన్నాయి. మూడు, నాలుగు వారాల పాటు వార్న్ నడవలేక బెడ్‌కే పరిమితమయ్యాడు. ఆ సమయంలో తన చేతులను కిందపెట్టి నడవడం అలవాటు చేసుకున్నాడు. ఇది వార్న్‌లో కసిని పెంచింది. ఆ తర్వాత క్రికెటర్‌గా మారే సమయంలో.. ఎక్కువగా భుజాలపై ఒత్తిడి తెస్తూ బలంగా తయారు చేసుకున్నాడు.  ఆ తర్వాత వార్న్‌కు ఎదురు లేకుండా పోయింది. ఒక రకంగా వార్న్‌ దిగ్గజ స్పిన్నర్‌గా తయారు కావడానికి తన భుజాలే సక్సెస్‌ ఫార్ములాగా నిలిచింది.'' అని చెప్పుకొచ్చాడు. 

కాగా అశ్విన్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక షేన్‌ వార్న్‌ 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్‌లో వార్న్‌.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్‌ వార్న్‌ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: 'భయమేస్తే గట్టిగా హత్తుకునేదాన్ని.. మిస్‌ యూ నాన్న'

Shane Warne: ‘నేను వార్న్‌ను అంతమాట అనకుండా ఉండాల్సింది’

Prithvi Shaw: నా బ్యాటింగ్‌ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా 

మరిన్ని వార్తలు