-

‘పిచ్‌ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’

28 Feb, 2021 05:29 IST|Sakshi

చర్చ చేయి దాటిపోతోందంటూ అశ్విన్‌ అసహనం

అహ్మదాబాద్‌: భారత్, ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో పిచ్‌ నాణ్యతపై చర్చ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇంగ్లండ్‌ మీడియా ఈ విషయంపై తమ విమర్శలు కొనసాగిస్తోంది. అయితే భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మాత్రం ఇది తీవ్ర అసహనాన్ని కలిగించింది. పిచ్‌ గురించి ప్రశ్నించిన ఒక ఇంగ్లండ్‌ మీడియా ప్రతినిధిపై అతను విరుచుకుపడ్డాడు. తాము ఎప్పుడూ గెలిచినా పిచ్‌ గురించే మాట్లాడతారని అతను వ్యాఖ్యానించాడు.

‘బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరాటం జరగాలని అంతా అంటారు కానీ అసలు మంచి పిచ్‌ అంటే ఏమిటి? ఆటలో బౌలర్లు వికెట్‌ తీయాలనుకుంటే బ్యాట్స్‌మెన్‌ పరుగులు తీసేందుకు ప్రయత్నించడం సహజం. మంచి పిచ్‌ అంటే ఏమిటో ఎవరు వివరిస్తారు. ఆరంభంలో పేచ్‌కు అనుకూలించి ఆపై బ్యాటింగ్‌కు, చివరి రోజుల్లో స్పిన్‌కు అనుకూలించాలా? అసలు ఎవరు ఈ నిబంధనలు రూపొందించారు. ప్రతీ ఒక్కరికి తమ అభిప్రాయం ఉండవచ్చు కానీ దానిని ఇతరులపై రుద్దితే ఎలా? పిచ్‌లపై చర్చ చేయి దాటిపోతోంది. దీనిని ఆపి తీరాలి. మేం మరో దేశంలో ఆడినప్పుడో, మరో పిచ్‌ గురించి ఇంత చర్చ జరిగిందా? న్యూజిలాండ్‌తో మేం ఆడిన రెండు టెస్టులు కలిపి ఐదు రోజుల్లో ముగిసిపోయాయి. ఎవరైనా మాట్లాడారా? అయితే ఇలాంటి ఆలోచనాధోరణి నన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే దశాబ్దకాలంగా ఇది జరుగుతూనే ఉంది’ అని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు