Ravindra Jadeja: జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా 

6 Mar, 2022 11:33 IST|Sakshi

టీమిండియా, శ్రీలంక మధ్య జరుగతున్న తొలి టెస్టు రవీంద్ర టెస్టుగా మారిపోయింది. బ్యాటింగ్‌లో 150కి పైగా పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లతో మెరిసి ఆల్‌రౌండర్‌ అనే పదానికి మరోసారి అర్థం చెప్పాడు. స్వదేశీ పిచ్‌లపై తన బౌలింగ్‌ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. లంకతో తొలి టెస్టులో ముందు బ్యాటింగ్‌లో 228 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 175 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో 13 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా జడేజా టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అవేంటో పరిశీలిద్దాం.

►ఒకే టెస్టు మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు.. ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా .. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 
►ఇంతకముందు టీమిండియా తరపున వినూ మాన్కడ్‌ 1952లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బ్యాటింగ్‌లో 184 పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీశాడు.


►1962లో వెస్టిండీస్‌తో టెస్టులో మరో భారత క్రికెటర్‌  పాలి ఉమ్రిగర్‌ 172 పరుగులు నాటౌట్‌.. ఐదు వికెట్లు తీశాడు
►ఇక ఓవరాల్‌గా జడేజా ఆరో స్థానంలో ఉండగా.. వినూ మాన్కడ్‌, డెనిస్‌ అట్‌కిన్సన్‌, పాలి ఉమ్రిగర్‌, గ్యారీ సోబర్స్‌, ముస్తాక్‌ మహ్మద్‌ ఉన్నారు. 
►జడేజా ఆఖరుసారి టెస్టుల్లో 2017లో ఐదు వికెట్లు తీశాడు. అప్పుడు ప్రత్యర్థి శ్రీలంకనే కావడం విశేషం. కొలంబో వేదికగా జరిగిన ఆ టెస్టులో జడేజా 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తాజాగా మరోసారి శ్రీలంకపై ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు.
►జడేజాకు టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది పదోసారి. 


►ఇక టెస్టులో టీమిండియా శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం పదోసారి కావడం విశేషం.

మరిన్ని వార్తలు