ధోని తరహాలో జడ్డూ పోస్ట్‌.. ఫ్యాన్స్‌లో ఆందోళన

9 Feb, 2021 18:15 IST|Sakshi

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఫిబ్రవరి 8న ట్విటర్‌ వేదికగా రిలీజ్‌ చేసిన వీడియో ఆసక్తిని రేకెత్తించింది. వీడియో ఆసక్తిగా ఉందోమో అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇక్కడ ఆసక్తి వీడియో గురించి కాదు.. అతను పోస్ట్‌ పెట్టిన సమయం. జడేజా పోస్ట్‌ చేసిన సమయం రాత్రి 7. 47 గంటలు... ఈ టైమ్‌ చూస్తే మనకు ఒక అంశం గుర్తుకురాక మానదు. అదే ఎంఎస్‌ ధోని రిటైర్‌మెంట్‌. ధోని కూడా ఇదే సమయానికి అటూ ఇటుగా గుడ్‌బై చెప్పాడు. 2020 ఆగస్టు 15.. రాత్రి 7.29 గంటలకు ధోని ట్విటర్‌ వేదికగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

ఇప్పుడు జడేజా కూడా అదే సమయానికి వీడియో పెట్టడం.. అతను రాసుకొచ్చిన క్యాప్షన్‌ కూడా అదే విధంగా ఉండడంతో కొంతమంది ఫ్యాన్స్‌ ఆందోళనకు గురయ్యారు. జడేజా కూడా రిటైర్‌ అయ్యాడా అంటూ కామెంట్లు కూడా జత చేశారు. దీంతో జడేజా పోస్టు ట్విటర్‌లో ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి ఎక్కేసింది. ఇక అసలు విషయంలోకి వెళితే.. రవీంద్ర జడేజా టీమిండియాలోకి అరంగేట్రం చేసి నిన్నటితో( ఫిబ్రవరి 8) 12 సంవత్సరాలు పూర్తైంది. ఫిబ్రవరి 8, 2009లో శ్రీలంకతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేసిన జడేజా ఈ పుష్కర కాలంలో గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.

తన 12 ఏళ్ల కెరీర్‌లో 168 వన్డేల్లో 2411 పరుగులు, 51 టెస్టుల్లో 1954 పరుగులు, 50 టీ20ల్లో 217 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌ విషయానికి వస్తే.. వన్డేల్లో 188 వికెట్లు, టెస్టుల్లో 220 వికెట్లు, టీ20ల్లో 39 వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా జడేజా టీమిండియాతో తన 12 ఏళ్ల ప్రస్థానాన్ని ట్విటర్‌లో పంచుకున్నాడు. ' నా చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలనే కోరిక బలంగా ఉండేది. 12 ఏళ్ల క్రితం అది నెరవేరినా.. ఇంకా మొన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. భారత్‌కు ఆడడం అనేది మాటల్లో వర్ణించలేను.. దేశానికి ఆడడమే గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇంతకాలం నాకు మద్దతు, ప్రేమను పంచిన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు