కోడలిపై రవీంద్ర జడేజా తండ్రి సంచలన ఆరోపణలు

9 Feb, 2024 16:30 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇంట్లో విబేధాలు రచ్చకెక్కాయి. కోడలి విషయంలో తండ్రి కోడుకుల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జడ్డూ తండ్రి అనిరుద్ద్‌సిన్హ్‌ జడేజా కోడలు రివాబాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రివాబా కారణంగా తమ కుటుంబంలో చీలికలు వచ్చాయని ఆరోపించాడు. పెళ్లైన మూడు నెలల నుంచే రివాబా ‍తమ కుటుంబంలో అగాధాలు సృష్టించిందని అన్నాడు. రివాబా కారణంగానే తాను ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిపాడు. కేవలం డబ్బు, హోదా కోసమే రివాబా జడేజాతో కాపురం చేస్తుందని ఆరోపించాడు. తన కొడుకుకు తనకు మాటాలు లేక చాలాకాలమైందని తెలిపాడు.

తన మనవరాలిని (జడేజా కూతురు) చూసేందుకు కూడా రివాబా అంగీకరించడం లేదని అన్నాడు. కొడుకు, కోడలు తన పట్ల కఠినంగా ఉంటున్నందుకు అతను కూడా వారితో అలాగే ప్రవర్తిస్తున్నట్లు తెలిపాడు. పెళ్లి తర్వాత జడేజాలో కూడా చాలా మార్పులు వచ్చాయని అన్నాడు. జడేజా క్రికెటర్‌ కాకపోయుంటే రివాబా అతన్ని పెళ్లి చేసుకునేది కాదంటూ సంచలన ఆరోపణలు చేశాడు.

లేటు వయసులో జడేజా తనను పట్టించుకుపోవడమే కాకుండా కనీస అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వట్లేదని అన్నాడు. చనిపోయిన తన భార్య పెన్షన్‌ డబ్బులతో కాలం వెల్లదీస్తున్నట్లు తెలిపాడు. తండ్రి చేసిన వ్యాఖ్యలపై రవీంద్ర జడేజా సైతం స్పందించాడు. తన తండ్రి వ్యాఖ్యలన్ని అబద్దాలేనని కొట్టిపారేశాడు. తన భార్య పరువుకు భంగం కలిగేందుకు తన తండ్రి ద్వారా ఎవరో ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తెలిపాడు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలు పిచ్చి వ్యాఖ్యలని అన్నాడు. అతను చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు నమ్మవద్దని ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 

కాగా, జడేజా భార్య రివాబా గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యేగా ఉంది. ఆమె జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. జడేజా తన భార్య బిడ్డతో కలిసి సొంత బంగ్లాలో నివసిస్తుండగా.. జడ్డూ తండ్రి అనిరుద్ద్‌సిన్హ్‌ జామ్‌నగర్‌లో ఓ  డబుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఒంటిరిగా జీవిస్తున్నాడు. గాయం కారణంగా జడేజా ఇటీవల ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన రెండో టెస్ట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega