ఇంగ్లండ్‌తో సిరీస్‌.. ఆ ఆటగాడు దూరం

21 Jan, 2021 15:48 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆసీస్‌ పర్యటనలో భాగంగా గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడేజా గబ్బా టెస్టుకు దూరమయ్యాడు. కాగా బ్యాటింగ్‌ సమయంలో బంతి జడేజా బొటనవేలికి బలంగా తగిలింది. దీంతో జడేజాకు ఆస్ట్రేలియాలోనే సర్జరీ నిర్వహించిన వైద్యులు కనీసం ఆరువారాల విశ్రాంతి అవసరమని  తెలిపారు. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమవడంతో పాటు వన్డే సిరీస్‌లోనూ ఆడడం అనుమానంగానే ఉంది. టెస్టు సిరీస్‌ ముగిసేసరికి జడేజాకు ఆరు వారాలు పూర్తవుతాయి.. అనంతరం అతని ఫిట్‌నెస్‌ను పరీక్షించి పరిమిత ఓవర్లలో ఆడేది లేనిది సెలక్టర్లు నిర్ణయిస్తారని బీసీసీఐ తెలిపింది.

కాగా ఆసీస్‌ పర్యటన ముగించుకొని గురువారం ఉదయం ఇతర టీమిండియా క్రికెటర్లతో కలిసి జడేజా భారత్‌ చేరుకున్నాడు. రిహాబిలిటేషన్ కోసం జడ్డూను  బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపనున్నారు. ఆసీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా.. జడేజా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. అదే మ్యాచ్‌లో బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో కంకషన్‌కు గురయ్యాడు. అతని స్థానంలో వచ్చిన చహాల్‌ మ్యాచ్‌ గెలిపించిన సంగతి తెలిసిందదే. అనంతరం ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో బరిలో దిగిన జడ్డూ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇంగ్లండ్‌తో  జరగనున్న తొలి రెండు టెస్టులకు ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. చదవండి: అతడితో నన్ను పోల్చడం అద్భుతం కానీ..: పంత్‌

భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.

మరిన్ని వార్తలు