జడ్డూ లేట్‌ చేసి ఉంటే కథ వేరే ఉండేది

8 Jan, 2021 15:47 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంటేనే మెరుపు ఫీల్డింగ్‌కు చిరునామా. మైదానంలో పాదరసంలా కదిలే జడేజా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్‌ను రనౌట్‌ చేసిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. స్మిత్‌ను రనౌట్‌ చేయడం ద్వారా జడేజా తన ఫీల్డింగ్‌ విలువేంటో మరోసారి చూపించాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కడదాకా నిలిచి టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేసిన స్మిత్‌ టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారాడు.(చదవండి: సెంచరీలు సమం చేసి.. పరుగుల్లో దాటేశాడు!)

అతని ఒక్క వికెట్‌ పడితే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసినట్లే. ఈ దశలో 131 పరుగులు చేసిన స్మిత్‌ బుమ్రా బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్‌ స్వ్కేర్‌లో షాట్‌ ఆడాడు. రెండో పరుగు తీసి స్ట్రైకింగ్‌ తీసుకుందామని యత్నించే క్రమంలో స్మిత్‌ రనౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. అయితే  స్మిత్‌ను జడేజా రనౌట్‌ చేసిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాక్‌వర్డ్‌ స్వేర్‌ లెగ్‌ నుంచి బంతిని అందుకున్న జడేజా బుల్లెట్‌ వేగంతో స్టైకింగ్‌ ఎండ్‌వైపు బంతిని విసరగా అది నేరుగా వికెట్లను గిరాటేసింది. ఒకవేళ జడేజా ఈ రనౌట్‌ చేయకుంటే స్మిత్ డబుల్‌ సెంచరీ కూడా చేసేవాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.‌ కాగా స్మిత్‌ సెంచరీతో ఆసీస్‌ తొలిసారి టెస్టు సిరీస్‌లో 300 మార్కును అధిగమించింది.


మరోవైపు సిడ్నీ టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన జడేజా విదేశీ గడ్డపై మూడో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇంతకముందు దక్షిణాఫ్రికాపై జోహెన్నెస్‌ బర్గ్‌లో 138 పరుగులకే 6 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయగా.. కొలంబొ వేదికగా 152 పరుగులకే 5 వికెట్లు తీసిన జడేజా విదేశీ గడ్డపై రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.శుక్రవారం రెండో రోజు ఆట  ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి  పుజారా(9 బ్యాటింగ్‌), రహానే(5 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్‌(26;77 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ,  శుబ్‌మన్‌ గిల్‌(50;101 బంతుల్లో 8 ఫోర్లు) ల వికెట్లను భారత్‌ చేజార్చుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు