వాళ్లిద్దరూ పట్టుదలగా నిలబడ్డారు: జడేజా

23 Jan, 2021 19:10 IST|Sakshi

ఇంజక్షన్‌ చేయించుకున్నా.. బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యాను

న్యూఢిల్లీ: ‘‘నిజానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్యాడ్స్‌ కూడా కట్టుకున్నాను. ఇంజక్షన్‌ తీసుకున్నాను. కనీసం 10- 15 ఓవర్లపాటు క్రీజులో ఉండాలని మానసికంగా సిద్ధమైపోయాను. ఎలాంటి షాట్లు ఆడాలి, ఫాస్ట్ ‌బౌలర్స్‌ను ఎలా ఎదుర్కోవాలి. క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలి అనే ఆలోచనలతోనే నా మెదడు నిండిపోయింది. నిజానికి గాయం కారణంగా అన్ని షాట్లు ఆడలేం కదా! అయితే పుజారా, పంత్‌‌ మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ దురదృష్టవశాత్తూ పంత్‌ అవుట్‌ అయిపోయాడు. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. మేం మ్యాచ్‌ డ్రా చేసుకోవాల్సి వచ్చింది’’ అంటూ టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సిడ్నీ టెస్టు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.(చదవండి: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌: పూర్తి షెడ్యూల్‌ ఇదే!)

కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా జడేజా గాయపడిన విషయం తెలిసిందే. అతడి బొటనవేలు విరిగి పోవడంతో సర్జరీ చేసిన వైద్యులు సుమారు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పట్టు బిగించడంతో ఎలాగైనా జట్టును గెలిపించాలనే ఉద్దేశంతో గాయంతోనైనా సరే ఆడేందుకు సిద్ధమయ్యానని జడేజా చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్‌ టుడేతో మాట్లాడిన అతడు..‘‘బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నా బొటనవేలు ఫ్రాక్చర్‌ అయింది. కానీ నేను ఆ విషయాన్ని గ్రహించనే లేదు. టెయిలెండర్స్‌తో కలిసి ఎలా పరుగులు రాబట్టాలా అన్న అంశం మీదే నా దృష్టి ఉంది. నిజానికి నా వేలు విరిగిపోయింది. మైదానం వీడి స్కానింగ్‌ చేయించుకున్న తర్వాతే ఈ విషయం తెలిసింది. అయినా సరే తప్పనిసరి అయితే బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాను.

అయితే, అశ్విన్‌, విహారి(ఇద్దరూ కలిసి 256 బంతులు ఎదుర్కొన్నారు) మ్యాచ్‌ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పట్టుదలగా నిలబడ్డారు. టెస్టు క్రికెట్‌లో ప్రతిసారీ పరుగులు రాబట్టడమే ముఖ్యం కాదు. పరిస్థితికి తగ్గట్లు మారుతూ ఉండాలి. మొత్తానికి సమిష్టి కృషితో మేం మ్యాచ్‌ను కాపాడుకోగలిగాం’’ అని జడేజా సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సిడ్నీ టెస్టును రహానే సేన డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు పింక్‌బాల్‌ టెస్టులో ఆసీస్‌ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి బదులు తీర్చుకున్న టీమిండియా, బాక్సింగ్‌ డే టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే, ఆసీస్‌కు మంచి రికార్డు ఉన్న గబ్బా మైదానంలో వారిని మట్టికరిపించి, అద్భుతమైన ఛేజింగ్‌తో చారిత్రక గెలుపును సొంతం చేసుకుని 2-1తో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకుంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా జడేజా దూరమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు