మంజ్రేకర్‌ కోసం వెతికాను.. అతని కోసమే అలా చేశాను

30 May, 2021 22:13 IST|Sakshi

ముంబై: 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాట్‌ తిప్పుతూ చేసుకున్న సంబురాలపై టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజా స్పందించాడు. ప్రముఖ వ్యాఖ్యాత టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌.. అదే వరల్డ్‌ కప్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా తనను ఉద్దేశిస్తూ 'బిట్స్‌ అండ్‌ పీసెస్‌' లాంటి క్రికెటర్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, అందుకు బదులుగా తాను అలా సంబురాలు చేసుకున్నాని జడ్డూ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన అనంతరం కామెంట్రీ బాక్స్ ఎక్కడుందా అని వెతికానని, అది అక్కడే ఎక్కడో ఉంటుందని భావించానని, మంజ్రేకర్‌ కోసమే అప్పుడలా చేశానని వివరించాడు. 

ఈ ఎపిసోడ్‌కు సంబంధించి జడేజా సైతం అప్పుడే ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో మంజ్రేకర్‌కు చురకలంటించాడు. నీ నోటి విరేచనాలను ఆపుకోవాలంటూ ఘాటుగా బదులిచ్చాడు. ఇదిలా ఉంటే, ఆ మ్యాచ్‌లో జడేజా 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 77 పరుగులు సాధించి టీమిండియాను గెలిపించినంత పనిచేశాడు. అతను ధోనీ (72 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 50)తో కలిసి ఏడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకుని, బ్యాట్‌ను పైకెత్తి కత్తి తిప్పినట్లు తిప్పి సంబరాలు చేసుకున్నాడు. 

కాగా, ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 239/8 స్కోర్‌ చేసి టీమిండియాకు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఛేదనలో భారత టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలడంతో ఓ దశలో 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. అయితే, జడేజా, ధోనీ శతక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చివర్లో కివీస్‌ ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకున్న ధోని, జడేజాను స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేయడంతో భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి

మరిన్ని వార్తలు